మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 20, 2020 , 01:27:27

ఒకే పన్ను రేటు కావాలి

ఒకే పన్ను రేటు కావాలి
  • కార్పొరేట్‌ పన్నుల్లో తేడాలొద్దు
  • 15 శాతంగా నిర్ణయించండి
  • బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఐఐ

న్యూఢిల్లీ, జనవరి 19: కార్పొరేట్‌ పన్ను రేట్లలో తేడాలు వద్దని, అన్నింటినీ 15 శాతంగా నిర్ణయించాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ.. కేంద్రాన్ని కోరింది. రాబోయే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసిన సీఐఐ.. ఏప్రిల్‌ 1, 2023 నాటికి ఎటువంటి మినహాయింపులు, ప్రోత్సాహకాలు లేకుండా అమలు చేయాలని సూచించింది. దీనివల్ల మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచినట్లవుతుందని, పెట్టుబడులకూ ఊతమిచ్చినట్లువుతుందని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్‌ కిర్లోస్కర్‌ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. దీంతో కార్పొరేట్‌ పన్ను రేట్ల వ్యత్యాసాలతో తయారీ, సేవా రంగాల్లో అసమానతలు ఏర్పడుతున్నాయని, ఇది శుభపరిణామం కాదని కిర్లోస్కర్‌ వ్యాఖ్యానించారు. పన్ను రేట్లు తక్కువగా ఉంటే పెట్టుబడి భారం తగ్గుతుందని, ప్రోత్సాహం పెరిగి పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతాయన్నారు. కాగా, 2023కల్లా ఒకే కార్పొరేట్‌ పన్నును అమల్లోకి తెస్తామన్న ప్రకటన ఈ బడ్జెట్‌లోనే వస్తే మదుపరులు పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చే వీలుంటుందని చెప్పారు. గతేడాది కార్పొరేట్‌ పన్ను రేట్లను కేంద్రం 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను సంస్థ లు పొందకుండా చేసింది. అయినప్పటికీ నిరు డు అక్టోబర్‌ 1 నుంచి మార్చి 31, 2023 లోగా ఏర్పాటై ఉత్పత్తిని ప్రారంభించే సంస్థలకు కార్పొరేట్‌ పన్ను 15 శాతమేనని మోదీ సర్కారు స్పష్టం చేసింది. దీనికి సర్‌చార్జీ, సెస్సు అదనం. 1991-92లో 45 శాతంగా ఉన్న కార్పొరేట్‌ పన్ను.. 2019-20లో 22 శాతానికి దిగొచ్చింది.

ఏటీఎఫ్‌పై నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకం

విమానయాన ఇంధనం (ఏటీఎఫ్‌)పై నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకాన్ని వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. సమీప భవిష్యత్తులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఏటీఎఫ్‌ను కలిపే అవకాశాలు లేకుండటంతో ఈ నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకానికి మోదీ సర్కారు ఆలోచిస్తున్నది. ప్రస్తుతమున్న పన్ను ఉత్పాదక వ్యయం ఆధారిత పన్ను కావడంతో దీనితో సంబంధం లేకుండా నిర్దిష్ట పన్నుకు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌పై ఈ నిర్దిష్ట ఎక్సైజ్‌ సుంకాలు అమల్లో ఉన్నాయి. పెట్రోల్‌పై రూ.21.16, డీజిల్‌పై రూ.15,83గా వసూలు చేస్తున్నారు. నిర్దిష్ట పన్నుతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విమానయాన పరిశ్రమకూ మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఇదిలావుంటే పన్ను రహిత దుకాణాల నుంచి మద్యం బాటిళ్ల కొనుగోళ్లపైనా ఆంక్షలు పెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. స్వదేశానికి వస్తున్న భారతీయులు విదేశాల్లోని విమానాశ్రయాల్లో ఒక్క సీసాకు మించి మద్యాన్ని కొనుగోలు చేయరాదని వాణిజ్య మంత్రిత్వ శాఖ.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. అత్యవసరం కాని ఉత్పత్తుల దిగుమతిని తగ్గించడం కోసమే ఈ నిర్ణయమని స్పష్టం చేస్తున్నది. 2 సీసాల నుంచి ఒక సీసా మద్యానికి కోత పెట్టాలన్న వాణిజ్య శాఖ.. సిగరెట్‌ పెట్టెల కొనుగోళ్లపై నిషేధం విధించాలని కూడా సిఫార్సు చేసింది. బడ్జెట్‌లో ఈ మేరకు నిర్ణయాలుండాలని కోరింది.

సుంకాలను ఎత్తివేయండి

ఫెర్రో-నికెల్‌, స్టీల్‌ తుక్కు వంటి ముడి ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పరిశ్రమ కోరుతున్నది. వచ్చే బడ్జెట్‌లో ఈ మేరకు ఓ నిర్ణయాన్ని తీసుకుని, తమను ఆదుకోవాలని భారతీయ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎస్‌డీఏ) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశామని అసోసియేషన్‌ వెల్లడించింది. చైనా, కొరియా, జపాన్‌, ఈయూ, అమెరికా దేశాల్లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ తుక్కుపై దిగుమతి సుంకాలు లేవని అసోసియేషన్‌ అధ్యక్షుడు కేకే పహుజా గుర్తుచేశారు. సుంకాల ఎత్తివేత పరిశ్రమలో ఉద్యోగావకాశాలనూ పెంచగలదన్నారు. మరోవైపు కోకింగ్‌ కోల్‌, పెట్‌ కోక్‌, లైమ్‌స్టోన్‌, డోలమైట్‌ వంటి ముడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ కేంద్రాన్ని కోరింది.


logo
>>>>>>