సోమవారం 30 మార్చి 2020
Business - Feb 10, 2020 , 23:50:24

‘మైహోమ్‌' భలే గిరాకీ

‘మైహోమ్‌' భలే గిరాకీ
  • లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు
  • కోకాపేట్‌లో ‘మై హోమ్‌ తర్‌క్ష్య’ ప్రాజెక్టు ఆరంభం
  • మొదటి రోజే 325 యూనిట్ల అమ్మకం
  • భూమిపూజ చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో పేరెన్నికగల నిర్మాణ సంస్థ మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌.. హైఎండ్‌ లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో దాదాపు 325 అత్యాధునిక ఫ్లాట్లను విక్రయించి తమ ప్రత్యేకతను మరోసారి చాటుకున్నది. సోమవారం ఉదయం కోకాపేట్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి ‘మై హోమ్‌ తర్‌క్ష్య’ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అనంతరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. పశ్చిమ హైదరాబాద్‌లో విశేషంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట్‌లో సుమారు 5.82 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. ‘మై హోమ్‌ తర్‌క్ష్య’లో వచ్చే 660 ఫ్లాట్లన్నీ ఆధునిక లగ్జరీ గృహాలే  కావడం గమనార్హం. ఇక నిర్మాణ స్థలం కేవలం 22 శాతమే. మిగతా 78 శాతాన్ని ఓపెన్‌ స్పేస్‌గా కేటాయించారు. జి+ 32 అంతస్తుల ఎత్తులో కడుతున్న నాలుగు బ్లాకుల్లో వచ్చేవన్నీ ట్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లే. కేవలం రెండు సైజుల్లో, 1,957, 2,235 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లకు రూపకల్పన చేశారు. 


మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కొత్తగా ప్రాజెక్టును ప్రారంభిస్తే.. సకాలంలో కొనుగోలుదారులకు అందజేస్తుందనే ఖ్యాతినార్జించింది. వైవిధ్యమైన డిజైన్లు, ఆకట్టుకునే ఎలివేషన్లు, ఆధునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు వంటివి ఏర్పాటు చేయడంలో ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. నాణ్యతలో రాజీ పడకుండా హామీ ఇచ్చిన దానికంటే మెరుగైన రీతిలో నిర్మాణం చేపడుతుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో నెలకొన్నది. అందుకే ‘మై హోమ్‌' ఆరంభించే కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను తీసుకోవడానికి బయ్యర్లు పోటీ పడుతుంటారు. గతేడాది కొండాపూర్‌లో సంస్థ ఆరంభించిన ‘మైహోమ్‌ మంగళ’లో కొనడాన్ని ఆలస్యం చేసినవారిలో కొందరు కొనుగోలుదారులు.. ‘మై హోమ్‌ తర్‌క్ష్య’లో మొదటి రోజే తీసుకున్నారని సమాచారం. 


ఆధునిక సదుపాయాలకు పెద్దపీట

మై హోమ్‌ సంస్థ ఆరంభించే ప్రతి ప్రాజెక్టులో ఆధునిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తుందని తెలిసిందే. ఇప్పటికే పూర్తి చేసిన నవద్వీప, జ్యుయెల్‌, విహంగా వంటి ప్రాజెక్టులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అదే క్రమంలో, తాజాగా ‘మై హోమ్‌ తర్‌క్ష్య’లో ఆధునికతకు పెద్దపీట వేస్తున్నది. జి+ 4 అంతస్తుల ఎత్తులో 34 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక క్లబ్‌హౌజ్‌ను అభివృద్ధి చేస్తున్నది. స్విమ్మింగ్‌ పూల్‌, స్పా, ఫుల్లీ ఎక్విప్డ్‌ ఏసీ జిమ్‌, సూపర్‌ మార్కెట్‌, ఏసీ గెస్ట్‌ రూములు, క్రెష్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ కోర్టులు, ఔట్‌డోర్‌ ప్లే కోర్టులు, చిల్డ్రన్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులు వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో మై హోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


logo