బుధవారం 27 మే 2020
Business - May 13, 2020 , 01:05:25

చైనా టు భారత్‌

చైనా టు భారత్‌

  • వయా హాంకాంగ్‌, సింగపూర్‌
  • దేశంలోకి దొడ్డిదారిన డ్రాగన్‌ పెట్టుబడులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ దెబ్బకు చైనా ఆర్థిక పునాదులు కదిలిపోతున్నాయి. అగ్రరాజ్యాల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న వేళ.. కొత్త కుట్రలకు డ్రాగన్‌ తెర తీసింది. భారతీయ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశతో ముందుకు వస్తున్నది. ఈ క్రమంలోనే నేరుగా కాకుండా హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి దేశాల ద్వారా భారత్‌లో పెట్టుబడుల్ని పెడుతున్నది. దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న షియామీ చైనాకు చెందిన సంస్థేనన్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీ సింగపూర్‌ ద్వారా భారత్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడిని పెట్టడం గమనార్హం. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ప్రస్తుతం సింగపూర్‌దే మొదటి స్థానం. ఇక మన స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో చైనా మొబైల్‌ సంస్థల వాటా ఎంతలేదన్నా 4 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. చివరకు భారతీయ స్టార్టప్‌లైన ఉడాన్‌, డెల్హివరి, స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌, బైజూస్‌, స్నాప్‌డీల్‌, ఓలా, ఓయో రూమ్స్‌, పేటీఎంల్లోనూ చైనా సంస్థలు టెన్సెంట్‌, అలీబాబా పెట్టుబడులు పెట్టాయి. గ్లెన్‌మార్క్‌ ఫార్మాలో హెచ్‌ఎస్‌బీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సుమారు 3.29 శాతం వాటాను కొనుగోలు చేసింది.

చైనా పెట్టుబడులెన్ని?

భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థల్లో చైనా స్థానం దాదాపు చివరే. సింగపూర్‌, మారిషస్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, జపాన్‌ సంస్థలే తొలి ఐదు స్థానాల్లో నిలుస్తాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా సంస్థలు భారత్‌లో కేవలం 2.34 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్‌ గోయల్‌ పార్లమెంటులో ప్రకటించారు. కాగా, దొడ్డిదారిన హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాల మీదుగా దేశంలోకి అడుగుపెట్టిన చైనా పెట్టుబడులు 4.2 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని సమాచారం. ఇక దేశీయ స్టార్టప్‌ల్లో చైనా సంస్థల పెట్టుబడుల విలువ ఎంతలేదన్నా 3.9 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. గత నెల హెచ్‌డీఎఫ్‌సీలో తమ వాటాను చైనా ఒక శాతానికి పెంచుకున్నది తెలిసిందే. దీంతో చైనా నుంచి వచ్చే కొత్త పెట్టుబడులకు అనుమతిని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో భారత్‌కు చైనా పెట్టుబడులు హాంకాంగ్‌, సింగపూర్‌ల మీదుగా వస్తుండగా, దీనిపైనా మోదీ సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.


logo