సోమవారం 30 మార్చి 2020
Business - Feb 21, 2020 , 03:33:04

హైదరాబాద్‌లో సీజీఎస్‌ ఆఫీస్‌

హైదరాబాద్‌లో సీజీఎస్‌ ఆఫీస్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: అమెరికాకు చెందిన బిజినెస్‌ అప్లికేషన్‌, ఎంటర్‌ప్రైజెస్‌ లర్నింగ్‌, అవుట్‌సోర్సింగ్‌ సేవల సంస్థయైన కంప్యూటర్‌ జనరేటెడ్‌ సొల్యుషన్‌స(సీజీఎస్‌)..హైదరాబాద్‌లో మరో కార్యాలయాన్ని తెరిచింది. 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయాన్ని అమెరికా కాన్సులేట్‌ హైదరాబాద్‌ కాన్సులర్‌ జనరల్‌ జోయెల్‌ రిఫ్‌మాన్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈవో ఫిల్‌ ఫ్రైడ్‌మాన్‌ మాట్లాడుతూ..భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ నూతన సెంటర్‌ను ప్రారంభించినట్లు, ప్రస్తు తం ఈ సెంటర్‌లో 500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఏడాదిన్నరలోగా ఈ సంఖ్యను వెయ్యికి పెంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా తర్వాత కంపెనీ ఏర్పాటు చేసిన అతిపెద్ద సాఫ్డ్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఇదే కావడం విశేషం. టెక్నాలజీ రంగం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాదేనని, ఇక్కడ నైపుణ్యం కలిగిన సిబ్బందికి కొదవ లేదని, అలాగే అంతర్జాతీయంగా ఉన్న వినియోగదారులకు ఇక్కడి నుంచే సేవలు అందించడానికి అనువైన ప్రదేశం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ..ఆఫీస్‌ స్థలానికి హైదరాబాద్‌లో డిమాండ్‌ నెలకొన్నదని, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన ఐటీ, టెక్నాలజీ నిపుణులు లభించడంతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడే తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. దీంట్లోభాగంగానే సీజీఎస్‌ తమ వ్యాపారాన్ని మరింత విస్తరించిందని, ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ, రియల్టీ కంపొనెంట్‌ ఆఫ్‌ ది బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ సెంటర్‌ తోడ్పాటునందించనున్నదని ఆయన చెప్పారు. 


ఎపిక్యూ సెంటర్‌ కూడా..

యూఎస్‌కు చెందిన లీగల్‌ సేవల రంగానికి చెందిన ఎపిక్యూ కూడా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సెంటర్‌ను ప్రారంభించింది. భాగ్యనగరంలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌లోని సోహిని టెక్నాలజీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 80 కార్యాలయాలను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో విశాల్‌ చిబ్బర్‌ తెలిపారు. ఈ సెంటర్‌లో 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, త్వరలో ఈ సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. ఎంత మేర పెంచేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 


logo