మంగళవారం 20 అక్టోబర్ 2020
Business - Sep 26, 2020 , 00:42:16

జీఎస్టీ చట్టానికి తూట్లు

జీఎస్టీ చట్టానికి తూట్లు

  • రాష్ర్టాలకు అడ్డగోలుగా పరిహారాన్ని ఎగ్గొట్టారు 
  • అక్రమంగా రూ.47,272 కోట్లు అట్టిపెట్టుకున్నారు
  • తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కాగ్‌ 
  • నరేంద్ర మోదీ సర్కార్‌కు మొట్టికాయలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 25: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదన్న తెలంగాణ ప్రభుత్వ విమర్శతో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఏకీభవించింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో రాష్ర్టాలను నరేంద్ర మోదీ సర్కార్‌ దారుణంగా మోసగిస్తున్నదంటూ  తెలంగాణ సర్కార్‌ చేస్తున్న వాదన వాస్తవికమైనదేనని ధ్రువీకరించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రెండేండ్లలో కేంద్రం ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని తీవ్రంగా తప్పుబట్టింది. వస్తు, సేవల పన్ను అమలు వల్ల ఆదాయాన్ని కోల్పోయిన రాష్ర్టాలకు నష్టపరిహారం చెల్లించేందుకు ఉపయోగించాల్సిన రూ.47,272 కోట్ల నిధులను కేంద్రం అక్రమంగా తన వద్ద అట్టిపెట్టుకున్నదని తూర్పారబట్టింది. వాస్తవానికి ఈ నిధులను రాష్ర్టాలకు పరిహారంగా చెల్లించేందుకు నాన్‌-లాప్సబుల్‌ జీఎస్టీ కాంపెన్సేషన్‌ సెస్‌ కలెక్షన్‌ ఫండ్‌లో జమ చేయాల్సి ఉన్నదని, కానీ మోదీ సర్కార్‌ ఆ పని చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించిందని కాగ్‌ తన ఆడిట్‌ నివేదికలో దుయ్యబట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ.62,612 కోట్ల జీఎస్టీ పరిహార సెస్సులో రూ.56,146 కోట్లను, 2018-19లో వసూలైన రూ.95,081 కోట్ల జీఎస్టీ పరిహార సెస్సులో రూ.54,275 కోట్లను నాన్‌-లాప్సబుల్‌ ఫండ్‌లోకి కేంద్రం బదిలీ చేసిందని తెలిపింది. ఈ విధంగా మోదీ సర్కార్‌ 2017-18లో రూ.6,466 కోట్లు, 2018-19లో మరో రూ.40,806 కోట్లు తన వద్ద అట్టిపెట్టుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్టు కాగ్‌ లెక్క తేల్చింది. 

కేంద్రం అడ్డగోలు వాదన

పరిహార సెస్సు విషయం లో కొనసాగుతున్న గందరగోళం జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర, రాష్ర్టాల మధ్య విభేదాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. వస్తు, సేవలపై పన్నులను విధించే అధికారాలను వదులుకున్నందుకు రాష్ర్టాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చినంత పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించకపోవడమే ఇందుకు కారణం. ఆర్థిక వ్యవస్థ మందగించడంతో విలాసవంతమైన, హానికారకమైన వస్తువులపై వసూలవుతున్న పన్ను గణనీయంగా తగ్గిందని కేంద్రం చెప్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆదాయ లోటును అధిగమించేందుకు రాష్ర్టాలే రుణాలను సేకరించుకోవాలని వాదిస్తున్నది. ఈ వాదనను తెలంగాణతోపాటు కాంగ్రెస్‌, తృణమూల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్ష పాలిత రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే రుణాలు సేకరించి తమకు పరిహారం చెల్లించాలని ఆయా రాష్ర్టాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.logo