ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 27, 2021 , 02:08:56

బడ్జెట్‌ రూపకల్పనలో ఈ ఆరుగురే కీలకం

బడ్జెట్‌ రూపకల్పనలో ఈ ఆరుగురే కీలకం

బడ్జెట్‌ రూపకల్పనలో ఈ ఆరుగురే కీలకం

రాబోయే కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అడుగడుగునా ఆరుగురు సహకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. నిజానికి గతంలో వచ్చిన బడ్జెట్‌లు ఒక ఎత్తు.. ఈసారి రాబోయే బడ్జెట్‌ మరో ఎత్తు. మునుపెన్నడూ లేనివిధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్‌ కుదేలు చేసింది మరి. ఈ నేపథ్యంలో వస్తున్న బడ్జెట్‌పై సహజంగానే అంచనాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఎంతవరకు సీతారామన్‌ సైన్యం విజయవంతమైందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి మూలాధారమైన వార్షిక పద్దును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన ఆ ఆరుగురు ఎవరంటే..

అజయ్‌ భూషణ్‌ పాండే

ఆర్థిక కార్యదర్శి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఐదుగురు కార్యదర్శుల్లో అందరికంటే సీనియర్‌. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో ఆధార్‌ కార్డ్‌ ప్రక్రియలోనూ పాలుపంచుకున్నారు. ప్రస్తుత మోదీ సర్కారు పాలనలోని రెవిన్యూ విధానంలో భూషణ్‌ది చెరగని ముద్ర.

దేబాశిష్‌ పండా

ఆర్థిక సేవల కార్యదర్శి. ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌. బ్యాంకింగ్‌ రంగ నిపుణుడిగా పేరుంది. కరోనా నేపథ్యంలో బ్యాంక్‌ రుణాలకు క్షీణించిన ఆదరణను మళ్లీ పెంచడం, ఒత్తిడిలో ఉన్న రంగాలను గుర్తించి రుణాల ద్వారా నిధుల కొరతను తీర్చడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

తుహిన్‌ కాంత పాండే

పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ బాధ్యతలు ఈయనపైనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఖాజానాకు నిధుల సమీకరణ.. వాటాల విక్రయంపైనే ఆధారపడి ఉన్నది. 

టీవీ సోమనాథన్‌

వ్యయ కార్యదర్శి. తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌. గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించే పని ఈయనకే కేంద్రం అప్పగించింది. కొవిడ్‌-19 నేపథ్యంలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంపై దృష్టి సారించారు. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

తరుణ్‌ బజాజ్‌

ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. ప్రభుత్వ విధానాలు, పాలనలో 31 ఏండ్ల అనుభవం ఉన్నది. ఆర్థిక, పారిశ్రామిక రంగాలపై గట్టి పట్టుగలదు. హర్యానా క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. బడ్జెట్‌లో ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తే జీడీపీ పురోగమిస్తుందో చెప్పే బాధ్యత ఈయన చేతుల్లోనే కేంద్రం పెట్టింది.

కేవీ సుబ్రమణ్యన్‌

ముఖ్య ఆర్థిక సలహాదారు. చికాగో బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ యూనివర్సిటీ, ఐఐటీ, ఐఐఎంల పూర్వ విద్యార్థి. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. 2020-21 ఆర్థిక సర్వేలో కీలకపాత్ర పోషించారు. ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు తదితర రంగాలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేశారు.

రైతు భారతానికి 19 లక్షల కోట్లు!

బడ్జెట్‌లో పెరగనున్న వ్యవసాయ రుణ లక్ష్యం

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు నరేంద్ర మోదీ సర్కార్‌ ఎప్పటి నుంచో చెప్తున్నది. 2022 చివరి నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌-2021లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని దాదాపు రూ.19 లక్షల కోట్లకు పెంచే అవకాశమున్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ లక్ష్యం రూ.15 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో మరో రూ.4 లక్షల కోట్ల మేరకు పెంచవచ్చంటున్నాయి. రైతులకు వ్యవసాయ రుణాలను అందజేయడంలో ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం గత కొన్నేండ్ల నుంచి వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని ఏటేటా పెంచుతూ వస్తున్నది. ఈ రుణాల పంపిణీ కూడా లక్ష్యానికి మించి జరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2016-17లో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.9 లక్షల కోట్లుగా నిర్దేశించగా.. రూ.10.66 లక్షల కోట్ల రుణాలను అందజేశారని, అలాగే 2017-18లో కూడా లక్ష్యం కంటే రూ.1.68 లక్షల కోట్ల రుణాలను అధికంగా ఇచ్చారు. సాధారణంగా వ్యవసాయ రుణాలకు వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. అయితే స్వల్పకాలిక రుణాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ ఇస్తున్నది. గడువులోగా చెల్లిస్తే అదనంగా మరో 3 శాతం రాయితీ లభిస్తుంది. ఫలితంగా వడ్డీ 4 శాతానికే వస్తున్నది.

VIDEOS

logo