శనివారం 06 మార్చి 2021
Business - Nov 12, 2020 , 02:07:26

తయారీ రంగానికి ఊతం

తయారీ రంగానికి ఊతం

  • పీఎల్‌ఐ పథకానికి కేంద్రం ఆమోదం
  • రూ.2 లక్షల కోట్లకు పెరగనున్న కేటాయింపులు 

న్యూఢిల్లీ: దేశంలోని పది కీలక రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లపాటు ప్రోత్సాహకాలను అందజేయనున్నది. ఇందుకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకానికి బుధవారం ఆమోదముద్ర వేసింది. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ లాంటి రంగాలకు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్టు గతంలోనే ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు టెలికం, ఆటోమొబైల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ లాంటి మరికొన్ని రంగాలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. పీఎల్‌ఐ పథకం అమలు కోసం ఇప్పటికే రూ.51,311 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇకపై మరో రూ. 1,45,980 కోట్లు కేటాయించనున్నది. దీంతో రానున్న ఐదేండ్లలో పీఎల్‌ఐ అమలుకు జరిపే మొత్తం కేటాయింపులు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరనున్నాయి.

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ పథకం దోహదపడుతుంది. అంతర్జాతీయంగా పోటీపడేలా దేశీయ తయారీదారులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం ఈ పథకాన్ని ఆమోదించినట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీలో విలేకర్లకు తెలిపారు. క్యాబినెట్‌ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరిస్తూ.. తయారీదారులకు గొప్ప ప్రోత్సాహకాలను అందజేయడం ద్వారా స్వావలంబన లక్ష్య సాధన దిశగా దేశం అడుగులు వేసేందుకు పీఎల్‌ఐ పథకం దోహదపడుతుందన్నారు. మరోవైపు సామాజిక మౌలిక వసతుల (సోషల్‌ ఇన్‌ఫ్రా) రంగాల కోసం రూ. 8,100 కోట్లతో         వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పథకాన్ని తీసుకురావాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ పథకం ఆర్థిక మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రమే అందుబాటులో ఉన్నది.

రంగాలవారీగా ప్రోత్సాహకాలు

ఆటోమొబైల్స్‌, వాహన విడిభాగాలు
(రూ. కోట్లలో) 57,042
అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీ
18,100
ఫార్మాస్యూటికల్స్‌, డ్రగ్స్‌
15,000
టెలికం, నెట్‌వర్కింగ్‌ ఉత్పత్తులు
12,195
జౌళి ఉత్పత్తులు
10,683
ఆహార ఉత్పత్తులు
10,900
స్పెషాలిటీ స్టీల్
6,322
వైట్‌ గూడ్స్‌
6,238
ఎలక్ట్రానిక్స్‌, టెక్నాలజీ ఉత్పత్తులు
5,000
హై ఎఫీషియెన్సీ సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌
4,500

VIDEOS

logo