ఆదివారం 24 మే 2020
Business - Jan 15, 2020 , 00:31:28

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ కన్నెర్ర

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై సీసీఐ కన్నెర్ర
  • వ్యాపారంలో అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశం..
  • ఈ - కామర్స్‌ దిగ్గజాలపై ఢిల్లీ వ్యాపార్‌ మహాసంఘ్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ, జనవరి 14: ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఆమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా -(సీసీఐ) కన్నెర్ర చేసింది. వస్తు కొనుగోలుదారులకు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అడ్డగోలుగా రాయితీలు ప్రకటించడంతోపాటు తమ వేదికల ద్వారా అమ్మకాలు జరుపుతున్న కొంతమంది వ్యాపారులతో కుమ్మక్కవుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఆ రెండు సంస్థలపై దర్యాప్తునకు ఆదేశించింది. అమ్మకాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌పై కఠిన చర్యలు తప్పవని సీసీఐ హెచ్చరించింది. ఈ-కామర్స్‌ సంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ‘ఢిల్లీ వ్యాపార్‌ మహాసంఘ్‌' ఫిర్యాదు చేయడంతో సీసీఐ ఈ చర్య చేపట్టింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు వాటి అనుబంధ ఉపకరణాలను విక్రయించే వ్యాపారులు ఢిల్లీ వ్యాపార్‌ మహాసంఘ్‌లో అధికంగా ఉన్నారు.

ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు ప్రిఫరెన్షియల్‌ లిస్టింగ్‌, ఎక్స్‌క్లూజివ్‌ టై-అప్స్‌, ప్రైవేట్‌ లేబుల్స్‌ లాంటి అక్రమ పద్ధతులను అవలంబిస్తున్నాయని, ఆరోగ్యకరమైన వ్యాపార పద్ధతులకు ఇవి పూర్తి విరుద్ధమని ఢిల్లీ వ్యాపార్‌ మహాసంఘ్‌ ఆరోపించింది. వాస్తవానికి అడ్డగోలు రాయితీలు, ఉద్దేశపూర్వక తగ్గింపు ధరలతో అమ్మకాలు జరిపే ఎలాంటి హక్కు ఈ-కామర్స్‌ సంస్థలకు లేదు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు సొంత ఉత్పత్తులను కలిగి ఉండేదుకు కూడా వీల్లేదు. కేవలం వినియోగదారులను ఉత్పత్తి సంస్థలతో అనుసంధానం చేయడమే వాటి పని. ఈ నిబంధనలను ఈ-కామర్స్‌ సంస్థలు తుంగలో తొక్కి ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మడం వల్ల రిటైల్‌ వర్తకులు భారీ నష్టాలతో కుదేలవుతున్నారు.

దర్యాప్తునకు సహకరిస్తాం..

సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ స్పందించాయి. సీసీఐపై తమకు నమ్మకం ఉన్నదని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని అమెజాన్‌ పేర్కొంది. సీసీఐ ఉత్తర్వులను సమీక్షిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి తెలిపారు. వ్యాపార చట్టాలను, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను తాము అతిక్రమించలేదని, అన్ని నిబంధనలను పూర్తిగా అనుసరిస్తున్నామని చెప్పారు. తమ వేదిక ద్వారా ఎంతోమంది చిన్నవ్యాపారులు, చేతివృత్తులవారు, అమ్మకందార్లతోపాటు అనేక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవకాశం కల్పించి నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తున్నందుకు గర్వపడుతున్నామన్నారు. ఎంతో పారదర్శకంగా వ్యాపారం చేస్తూ లక్షలమందికి ఉద్యోగాలను కల్పించామని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి తెలిపారు.


logo