గురువారం 13 ఆగస్టు 2020
Business - Jul 03, 2020 , 02:42:19

జీవీకేపై సీబీఐ

జీవీకేపై సీబీఐ

  • ముంబై ఎయిర్‌పోర్ట్‌ కుంభకోణంలోగ్రూప్‌ చైర్మన్‌ వెంకట కృష్ణారెడ్డిపై కేసు
  • ఆయన కుమారుడు సంజయ్‌రెడ్డి, 11 సంస్థలపై కూడా
  • ముంబై, హైదరాబాద్‌ కార్యాలయాల్లో సోదాలు
  • రూ.705 కోట్ల నిధులను దారిమళ్లించారని ఆరోపణ

న్యూఢిల్లీ, జూలై 2: జీవీకే గ్రూప్‌నకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) షాకిచ్చింది. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌) నిధుల నుంచి రూ.705 కోట్లను దారిమళ్లించారన్న ఆరోపణలపై ఆ గ్రూప్‌ చైర్మన్‌ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ఎంఐఏఎల్‌ డైరెక్టర్‌ జీవీ సంజయ్‌రెడ్డితోపాటు ఎంఐఏఎల్‌, జీవీకే గ్రూపునకు చెందిన జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మరో 9 ప్రైవేట్‌ కంపెనీలపై కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్‌లోని జీవీకే గ్రూప్‌ కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. 

జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), ఇతర పెట్టుబడిదారులు కలిసి పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) కింద జాయింట్‌ వెంచర్‌లో ఎంఐఏఎల్‌ను నడుపుతున్నాయి. ఎంఐఏఎల్‌ రాబడులను తక్కువగా, వ్యయాన్ని ఎక్కువగా చూపుతూ రికార్డులను తారుమారుచేసి భారీగా నిధులను దారిమళ్లించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వివరించారు. ముంబై విమానాశ్రయ ఆధునీకరణ, నిర్వహణ కోసం ఏఏఐ 2006 ఏప్రిల్‌ 4న ఎంఐఏఎల్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఎంఐఏఎల్‌ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు గుర్తుతెలియని కొందరు ఏఏఐ అధికారులతో కలిసి జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు వివిధ మార్గాల్లో నిధులను దారిమళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయని సీబీఐ అధికారులు తెలిపారు. 2017-18లో జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు బోగస్‌ వర్క్‌ కాంట్రాక్టులతో 9 కంపెనీలకు నిధులు మళ్లించారని, దీంతో ఎంఐఏఎల్‌కు రూ.310 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. 

మరోవైపు జీవీకే గ్రూపు కంపెనీలకు నిధులను సమకూర్చేందుకు ఎంఐఏఎల్‌కు చెందిన రూ.395 కోట్ల రిజర్వు నిధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నది. అంతేకాకుండా జీవీకే గ్రూపు తమ ప్రధాన కార్యాలయ, గ్రూపు కంపెనీల ఉద్యోగులకు చెల్లింపుల పేరిట వ్యయ లెక్కలను ఎక్కువగా చూపి ఎంఐఏఎల్‌కు రూ.100 కోట్ల నష్టాన్ని కలిగించిందని, వాస్తవానికి ఎంఐఏఎల్‌ నిర్వహణతో ఈ ఉద్యోగులెవరికీ సంబంధం లేదని సీబీఐ వివరించింది. దీనితో కూడా కలిపితే ఎంఐఏఎల్‌కు వాటిల్లిన నష్టం రూ.805 కోట్లకు చేరుతుందని, కానీ ఈ రూ.100 కోట్లను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చలేదని అధికారులు చెప్పారు. ఈ కుంభకోణం వల్ల ఎంఐఏఎల్‌కు వాటిల్లిన నష్టం.. మున్ముందు జరిగే దర్యాప్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అడ్డగోలు కాంట్రాక్టులతో జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు ఎంఐఏఎల్‌ రాబడులను తక్కువగా చూపారని, అంతేకాకుండా తమ వ్యక్తిగత, కుటుంబ ఖర్చుల కోసం ఎంఐఏఎల్‌ నిధులను ఉపయోగించుకొన్నారని సీబీఐ ఆరోపించింది.


logo