బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 01:18:41

బొగ్గు సరఫరా ఒప్పందంలో అక్రమాలు

బొగ్గు సరఫరా ఒప్పందంలో అక్రమాలు

న్యూఢిల్లీ, జనవరి 16:అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తోపాటు నేషనల్‌ కో-ఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌సీసీఎఫ్‌) మాజీ చైర్మన్‌, ఎండీ, మరొకరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మోసం, అవినీతి కేసును నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరాకు సంబంధించి టెండర్ల కోసం సంస్థ ఎంపిక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. సముద్ర జలాల ద్వారా విదేశాల నుంచి 6 లక్షల మిలియన్‌ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుని కడపలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్టీపీపీ), విజయవాడలోని నార్ల తాతా రావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు సరఫరా చేయాలని జూన్‌ 29, 2010న ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీజెన్కో) ఓ పరిమిత టెండర్‌ కోసం ఆరా తీసిందని గురువారం అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌సీసీఎఫ్‌సహా ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ టెండర్‌ వివరాలను ఏపీజెన్కో పంపించింది. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించి టెండర్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పటి ఎన్‌సీసీఎఫ్‌ చైర్మన్‌ వీరేందర్‌ సింగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీపీ గుప్తా, సీనియర్‌ సలహాదారు ఎస్‌సీ సింఘాల్‌లు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి.


ఈ నేపథ్యంలోనే వీరందరిపై ఐపీసీలోని నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద సీబీఐ కేసు నమోదు చేసింది. అర్హత లేకపోయినా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రతిఫలం ఆశించి ఎన్‌సీసీఎఫ్‌ పెద్దలు అవకాశం ఇచ్చారని సీబీఐ అంటున్నది. ఎఫ్‌ఐఆర్‌లోనూ ఈ మేరకు పేర్కొన్నది. హైదరాబాద్‌లోని ఎన్‌సీసీఎఫ్‌ కార్యాలయం కేంద్రంగా ఈ అక్రమం నడిచింది. అదానీతోపాటు ఎంబీసీఎల్‌, వియోం ట్రేడ్‌ లింక్స్‌, స్వర్ణ ప్రాజెక్ట్స్‌, గుప్తా కోల్‌ ఇండియా, క్యోరీ ఓరేమిన్‌ సంస్థలు బిడ్లను దాఖలు చేశాయని, వివిధ కారణాలతో అదానీ మినహా ఇతర సంస్థలను ఎన్‌సీసీఎఫ్‌ అధికారులు అడ్డుకున్నారని సీబీఐ తమ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేసింది. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ వ్యవహారంపై ఏ రకంగానూ స్పందించడం లేదు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి చెందినదే ఈ సంస్థ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అదానీ అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.


logo