శనివారం 06 జూన్ 2020
Business - Apr 15, 2020 , 02:35:01

ఇప్పుడే ఎంచుకోవాలి

ఇప్పుడే ఎంచుకోవాలి

  • ఉద్యోగులకు  పన్ను విధానాలపై సీబీడీటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారా?.. పాత పన్ను విధానంలోనే కొనసాగుతారా?.. అని సంస్థలు తెలుసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఉద్యోగులు సైతం తమతమ సంస్థలకు ఈ సమాచారాన్ని ముందుగానే అందించాలని తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే కొత్త, పాత పన్ను విధానాల్లో ఏదో ఒకదాన్ని ఉద్యోగులు ఎంచుకోవాలని, ఒక్కసారి ఎంచుకున్నాక అందులో మార్పుండదని చెప్పింది. సదరు విధానంలోనే వేతనాల నుంచి డీటీఎస్‌ను సంస్థలు కోత పెడుతాయని పేర్కొన్నది. అయితే ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు సమయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చని సీబీడీటీ ఉద్యోగులకు తెలియజేసింది. ఇక తమకు ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం ఉంటే ఆ వివరాలనూ ఉద్యోగులు తమ సంస్థలకు చెప్పాలని సూచించింది. 

సర్‌చార్జీపై వెసులు బాటు

మరోవైపు రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు 2019-20కిగాను టీడీఎస్‌ లెక్కింపు సందర్భంగా పెంచిన సర్‌చార్జీని డిపాజిట్‌ చేయకపోయినైట్లెతే ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆ పని చేయవచ్చని ఐటీ శాఖ తెలిపింది. రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల ఆదాయం ఉన్నవారి సర్‌చార్జీని 25 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. రూ.5 కోట్లపైన ఆదాయం ఉంటే 37 శాతానికి తీసుకెళ్లారు. ఇంతకుముందు ఇది 15 శాతంగానే ఉండేది. పెరిగిన సర్‌చార్జీలు గతేడాది ఏప్రిల్‌ 1 నుంచే వర్తిస్తాయని ఐటీ శాఖ స్పష్టం చేసింది.


logo