మంగళవారం 07 జూలై 2020
Business - Jun 01, 2020 , 00:51:47

వార్షిక విద్యుత్‌ బిల్లులపై సీబీడీటీ

వార్షిక విద్యుత్‌ బిల్లులపై సీబీడీటీ

  • లక్ష దాటితేచెప్పాలె   
  • 2019-20కి కొత్త ఐటీఆర్‌ ఫారాలు

న్యూఢిల్లీ, మే 31: గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) సంబంధించిన ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఫారాలను నోటిఫై చేసింది. వార్షిక విద్యుత్‌ బిల్లు లక్ష రూపాయలు, లేదా అంతకు మించితే ఐటీఆర్‌లో స్పష్టం చేయాల్సిందేనని సంస్థలకు తెలిపింది. బ్యాంక్‌లోని కరెంట్‌ ఖాతాలో డిపాజిట్లు కోటి రూపాయలు దాటినా వెల్లడించాల్సిందేనని చెప్పింది. విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా తెలియపరుచాలని పేర్కొన్నది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి జరిగినా సదరు సంస్థలు 2019-20 కిగాను ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సిందే. ఈ మేరకు ఐటీఆర్‌-1, 2, 3, 4 ఫారాల్లో కొత్త కాలమ్స్‌ను సీబీడీటీ తీసుకొచ్చింది. 

మొత్తం 8 ఫారాలు

సహజ్‌ (ఐటీఆర్‌-1), ఫాం ఐటీఆర్‌-2, ఫాం ఐటీఆర్‌-3, ఫాం సుగమ్‌ (ఐటీఆర్‌-4), ఫాం ఐటీఆర్‌-5, ఫాం ఐటీఆర్‌-6, ఫాం ఐటీఆర్‌-7, ఫాం ఐటీఆర్‌-v (వెరిఫికేషన్‌)లను 2019-20 (2020-21 మదింపు సంవత్సరం) కోసం శనివారం సీబీడీటీ నోటిఫై చేసింది. ఇక ఈ కొత్త ఐటీఆర్‌ ఫారాల ప్రకారం పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాల వివరాలనూ ప్రత్యేకంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం వివిధ కాలపరిమితుల పొడిగింపు ప్రయోజనాలను కల్పించిన విషయం తెలిసిందే. అయితే వీటిని పొందడానికీ ఐటీ రిటర్ను ఫారాలను సీబీడీటీ తాజాగా సవరించింది. సాధారణంగా ఏప్రిల్‌ మొదటి వారంలో ఐటీఆర్‌ ఫారాలను ఐటీ శాఖ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది జనవరిలోనే ఐటీఆర్‌-1, 2 ఫారాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పుడు అన్ని ఐటీఆర్‌ ఫారాలను సవరించి మళ్లీ కొత్తగా ప్రకటించింది. ఇదిలావుంటే ఐటీఆర్‌-4లో ఆధార్‌ నెంబర్‌ను సమర్పించినట్లయితే.. పాన్‌ నెంబర్‌ను స్పష్టం చేయాల్సిన అవసరంలేదు.
logo