సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 23, 2020 , 00:02:53

విదేశీ కేసులకూ ‘వివాద్‌ సే విశ్వాస్‌'

విదేశీ కేసులకూ ‘వివాద్‌ సే విశ్వాస్‌'
  • ప్రకటించిన ఐటీ శాఖ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ‘వివాద్‌ సే విశ్వాస్‌' పథకం విదేశీ కేసులకూ వర్తిస్తుందని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ శనివారం స్పష్టం చేసింది. పన్ను వివాదాలను పరిష్కరించి.. పన్ను చెల్లింపుదారులు-స్వీకరణదారులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో భాగంగా ఈ పథకాన్ని ఐటీ శాఖ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పథకం పరిధిలోకి విదేశాల్లోని పన్ను వివాదం కేసులనూ తెస్తున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఆదాయం పన్ను వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ పథకం ఓ సువర్ణావకాశంగా పేర్కొంటూ ఇప్పటికే ప్రముఖ దినపత్రికల్లో ఐటీ శాఖ విస్తృత ప్రకటనలు జారీ చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఈ నెల 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రకటించిన బడ్జెట్‌ సందర్భంగా ఈ పథకాన్ని పరిచయం చేసిన సంగతి విదితమే. ఈ ఏడాది జనవరి 31కి ముందు దాఖలైన విజ్ఞప్తులు, రిట్లను ఈ పథకం కింద పరిశీలించి పరిష్కరిస్తామని ఐటీ శాఖ తెలియజేసింది. 


పన్ను, జరిమానా, వడ్డీ, ఫీజు, టీడీఎస్‌, టీసీఎస్‌ సంబంధిత వివాదలను ఈ పథకం ద్వారా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని ఇంకా నోటిఫై చేయాల్సి ఉన్నది. ఏటేటా పెండింగ్‌లోని పన్ను వివాదాలు భారీగా పెరిగిపోతుండగా, వీటి వల్ల వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి దూరమైపోతున్నది. అలాగే పన్ను చెల్లింపుదారులూ నష్టపోతున్నారు. దీంతో వివాద్‌ సే విశ్వాస్‌కు మోదీ సర్కారు సిద్ధమైంది. ప్రభుత్వం లేదా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన కేసులన్నీ ఈ పథకంలోకి వస్తాయి. కమిషనర్‌ (అప్పీల్స్‌), డీఆర్పీ, ఐటీ అప్పీలెట్‌ ట్రిబ్యునల్‌, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న కేసులతోపాటు సీఐటీ ముందు పెండింగ్‌లో ఉన్న రివిజన్‌ కేసులను పరిష్కరించుకునే వీలున్నది. రూ.5 కోట్లకు దిగువన ఉన్న సెర్చ్‌ కేసులన్నింటికీ ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఇందుకు డిక్లరెంట్‌ తమ డిక్లరేషన్‌ను సంబంధిత అథారిటీ ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది.


logo