హైదరాబాద్, డిసెంబర్ 6: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ మారుతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను, ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ‘క్యాపిటల్యాండ్’ కూడా చేరింది. తన అనుబంధ సంస్థయైన క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్..తెలంగాణలో అతిపెద్ద డాటా సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదు నుంచి ఏడేండ్లకాలంలో ఈ డాటా సెంటర్ కోసం రూ.6,200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టబోతున్నది. మొన్నటికి మొన్న అమర రాజా బ్యాటరీస్ రూ.9,500 కోట్లతో లిథియం థర్మల్ బ్యాటరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నాలుగు రోజుల్లోనే ఈ అంతర్జాతీయ సంస్థ ఇక్కడ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించడం విశేషం.
షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోనూ..
ఆసియా దేశాల్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన క్యాపిటల్యాండ్.. షాపింగ్ మాల్స్, లాడ్జింగ్, ఆఫీస్‌లు, గృహాలు, బిజినెస్ పార్క్‌లు, ఇండస్ట్రియల్, లాజిస్టిక్ ఆస్తులను భారీగా కలిగివున్నది. ప్రస్తుతం సంస్థ సింగపూర్, చైనా, భారత్, వియత్నం, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా దేశాల్లో ఆస్తులు కలిగివున్నది.