గురువారం 28 మే 2020
Business - Apr 11, 2020 , 00:00:24

కరోనా కష్టాలు

కరోనా కష్టాలు

  • ఎగుమతుల్లో కోటిన్నర ఉద్యోగాలు మాయం 

దేశీయ ఎగుమతుల విభాగంలో కోటిన్నర వరకు ఉద్యోగాలు మాయం కాబోతున్నాయి. కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాణిజ్యం పూర్తిగా నిలిచిపోవడంతో భవిష్యత్తులో సగం ఆర్డర్లు నిలిచిపోవడంతో కోట్లాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోనున్నారని ఎఫ్‌ఐఈవో వెల్లడించింది. మరోవైపు బ్యాంకుల నిరర్థక ఆస్తులు కూడా మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ముఖ్యంగా దుస్తులు, జ్యూవెల్లరీ, హస్తకళలు, ఇంజినీరింగ్‌, టెక్స్‌టైల్స్‌, ఇతర రంగాల్లో అధికంగా ఉండనున్నదని తెలిపింది.    

1.5 లక్షల ఐటీ ఉద్యోగాలు మటాష్‌

కరోనా వైరస్‌ రక్కసి ఐటీ సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో వచ్చే కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోబోతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ సిబ్బందిలోని పలువురికి పింక్‌ స్లిప్‌ను కూడా జారీచేశాయి. ఈ వైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు కార్పొరేట్ల ఆదాయ, లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. 

ఇండిగో విమానాల్లో మీల్స్‌ రద్దు

కరోనా వైరస్‌ను అరికట్టడానికి సామాజిక దూరం పాటించాలన్న సూచనలమేరకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత తమ విమాన సర్వీసుల్లో బోర్డ్‌ మీల్స్‌ను రద్దు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. విమానాశ్రయ చెక్‌-ఇన్‌ కౌంటర్ల వద్ద కనీసం ఒక్క మీటర్‌ దూరం పాటించాలని, శానిటైజర్లు విరివిగా వినియోగించాలని డీజీసీఏ ఆదేశాలు జారీచేసింది. 

ఈ-లావాదేవీలు రెండింతలు

లాక్‌డౌన్‌ కారణంగా ఈ-లావాదేవీలు అమాంతం పెరిగాయి. గత నెల 24 నుంచి 31 వరకు ఏకంగా 7.2 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన 3.44 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. వీటి విలువ తెలియకపోయినప్పటికీ, ఏప్రిల్‌ 9న ఒకేరోజు రూ.2,004 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తున్నది. 

  మాకూ రిలీఫ్‌ ప్యాకేజీ ఇవ్వండి: ట్రక్కర్లు

రిలీఫ్‌ ప్యాకేజీ ఇవ్వాలని ట్రక్కర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా కోటికి పైగా ట్రక్కులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు. 4 లక్షల ట్రక్కుల్లో రూ.40 వేల కోట్లకు పైగా సరుకులు రోడ్డుపైన నిలిచిపోయాయని ఏఐఎంటీసీ వర్గాలు వెల్లడించాయి.  

180 విమానాల్లో సరుకు రవాణా

180 విమానాల్లో 258.24 టన్నుల సరుకును రవాణా చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అత్యవసర సరు కుల రవాణాకు కేంద్ర ప్రభుత్వం ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌'ను ప్రవేశపెట్టింది. వీటిలో 114 విమానాలు ఎయిర్‌ ఇండియా, అలయెన్స్‌ ఎయిర్‌కు సంబంధించినవి ఉన్నాయి.

 1.37 లక్షల మంది పీఎఫ్‌ విత్‌డ్రా

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా పెన్షన్‌ ఫండ్‌ నుంచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ.280 కోట్ల నిధులను వెనక్కితీసుకున్నారు. ఈ విషయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌వో) సంస్థ శుక్రవారం వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద 1.37 లక్షల మంది చందాదారులకు రూ.279.65 కోట్లు చెల్లించామమని ఈపీఎఫ్‌వో ఒక ప్రకటనలో పేర్కొంది. కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్స్‌ను కేవలం 72 గంటల్లోనే పరిష్కరిస్తున్నామని తెలిపింది. ఈపీఎఫ్‌వో వద్ద నమోదైన నాలుగు కోట్ల మంది ఉద్యోగులు, మూడు నెలల కనీస వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్‌ మొత్తంలో 75 శాతం ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ కింద పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.  


logo