న్యూఢిల్లీ, మే 18: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను స్టాండ్లోన్ ప్రాతిపదికన రూ.1,010.87 కోట్ల నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గడం వల్లనే లాభాల్లోకి రాగలిగామని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. 2019-20 ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.3,259.33 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.14,222.39 కోట్ల నుంచి రూ.21,522.60 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.