గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 26, 2021 , 14:07:43

క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..

క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..

ఒట్టావా : రకరకాల క్యాండీలు మనకు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో విదేశీ క్యాండీలు కూడా ఉంటున్నాయి. ఒక్కో క్యాండీది ఒక్కో కథ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో క్యాండీని ఇష్టపడుతుంటారు. క్యాండీలు తినేందుకు విదేశాల్లో పోటీలు కూడా పెడుతుంటారు. అంతగా క్యాండీలకు ప్రాచుర్యం ఉంటుంది. అందుకేనేమో.. క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావాలంటూ కెనడాకు చెందిన ఒక క్యాండీ తయారీ కంపెనీ ప్రకటన జారీచేసింది.

అంటారియోలోని మిస్సిసాగాలో ఉన్న క్యాండీ తయారీ కంపెనీ క్యాండీ ఫన్‌హౌస్ తమ క్యాండీలను రుచి చూసి ఏవిధంగా ఉన్నాయో సమీక్ష జరిపి చెప్పేందుకు ఉద్యోగులు అవసరమని సంస్థ వెబ్‌సైట్‌ candyfunhouse.ca లో కెరీర్స్‌లో ఈ ప్రకటనను పోస్ట్‌ చేసింది. ఉద్యోగులుగా తీసుకునే వీరు నిత్యం తాము తయారుచేసే క్యాండీలను రుచి చూసి వాటి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పాలన్నది. ఈ సంస్థ ప్రస్తుతం 3,000 రకాల ఉత్పత్తులను తయారుచేస్తున్నది. త్వరలో మరో పది రకాల క్యాండీలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అసలైన క్యాండీలను ఎన్నుకోవడంలో సహాయపడటానికి బలమైన దంతాలు కలిగివున్న పార్ట్‌టైమ్ ఫుల్‌టైమ్‌ అభ్యర్థులు అవసరమని పేర్కొంటున్నది.

క్యాండియోలోజిస్ట్‌లు "రుచి, ఆకృతి, నాణ్యత అంశాలను పరిగణనలోకి తీసుకుని క్యాండీల గొప్పదనాన్ని తెలుపాల్సి ఉంటుంది" అని క్యాండీ ఫన్‌హౌస్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే వారు అమెరికా, కెనాడా వాసులై ఉండి 18 ఏండ్ల వయసు పైబడిన వారు అర్హులు. ఆహార అలెర్జీలు లేకుండా ఉండేవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఉద్యోగంలో చేరే వారికి గంటకు 30 డాలర్ల పారితోషికాన్ని ఇవ్వనున్నారు. అయితే, కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేసుకోవాలని కంపెనీ నిర్ణయించింది. క్యాండీలంటే ఇష్టపడే వారు ఈ ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 15 వరకు గడువు విధించారు.

ఇవి కూడా చదవండి..

55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..

చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo