e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home బిజినెస్ టెలికం రంగానికి ఉత్సాహం.. ప్రోత్సాహం

టెలికం రంగానికి ఉత్సాహం.. ప్రోత్సాహం

  • 100% ఎఫ్‌డీఐలకు అనుమతి
  • బకాయిల చెల్లింపుపై నాలుగేళ్ల మారటోరియం
  • ఏజీఆర్‌ నిర్వచనంలో సవరణ.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15: రుణభారంలో కొట్టుమిట్టాడుతున్న టెలికం రంగం కోరుకుంటున్నట్లుగానే కేంద్రం భారీ ప్యాకేజీకి ప్రకటించింది. ముఖ్యంగా రూ.1 లక్ష కోట్లకుపైగా ఉన్న ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి ఈ రంగానికి పెద్ద ఊరట లభించింది. దివాలా అంచున ఉన్న వొడాఫోన్‌ ఐడియా మనుగడకు తాజా ప్యాకేజీ ఉపకరించి, దేశంలో మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు, ఒక ప్రభుత్వ కంపెనీ ఆరోగ్యకరంగా పోటీపడే వీలు కలుగుతుంది. ఏజీఆర్‌ నిర్వచనాన్ని హేతుబద్దీకరణ, నూరుశాతం ఎఫ్‌డీఐ, బకాయిల చెల్లింపుపై మారటోరియం తదితర నిర్ణయాల్ని క్యాబినెట్‌ తీసుకున్నదని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఈ రంగంలో 9 వ్యవస్థాగత సంస్కరణల్ని చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టెలికం రంగంపై తీసుకున్న నిర్ణయాల్ని వివరించారు. అవి&

ఏజీఆర్‌: అడ్జస్టడ్‌ గ్రాస్‌ రెవిన్యూ (ఏజీఆర్‌)లోంచి టెలికంయేతర ఆదాయాన్ని మినహాయించేలా నిర్వచనాన్ని సవరిస్తారు. గత ఒప్పందాల ప్రకారం టెలికం కంపెనీలు ఆర్జించే ఆదాయంలో కొంత శాతాన్ని కేంద్రానికి లైసెన్సు ఫీజుగా, స్పెక్ట్రమ్‌ వినియోగఛార్జీలుగా చెల్లించాల్సిఉంటుంది. తమకు డివిడెండ్లు, వడ్డీ ఆదాయం, ఆస్తుల విక్రయం తదితరాలతో వచ్చే ఇతర ఆదాయాన్ని ఏజీఆర్‌లో కలపడాన్ని టెలికం కంపెనీలు వ్యతిరేకించడంతో వాటి ఏజీఆర్‌ బకాయిలు తడిసిమోపడయ్యి, రూ.1.30 లక్షల కోట్లకు చేరాయి. టెలికంశాఖ డిమాండ్‌ చేస్తున్న ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భారీ చిక్కుల్లో పడిపోయిన టెలికం కంపెనీలకు ఊరటనిచ్చేలా ఏజీఆర్‌ నిర్వచనాన్ని మార్చేలా క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది.

- Advertisement -

ఎఫ్‌డీఐ: టెలికం రంగంలో ఆటోమేటిక్‌ మార్గం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. ఇప్పటివరకూ ఆటోమేటిక్‌ మార్గంలో 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉంది. అంతకుమించిన పెట్టుబడులపై వివిధ ప్రభుత్వ అనుమతులు అవసరం. తాజాగా క్యాబినెట్‌ నిర్ణయంతో ఎటువంటి అనుమతులూ లేకుండానే ఈ రంగంలో విదేశీ సంస్థలు నేరుగా 100 శాతం పెట్టుబడి చేయవచ్చు.

కస్టమ్స్‌: టెలికం ఆపరేటర్లు పరికరాల దిగుమతిని సరళతరం చేస్తూ కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ 19 53ను ఎత్తివేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

స్పెక్ట్రమ్‌: లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ యూజర్‌ చార్జీలు, ఇతర చార్జీల బకాయిలపై పెనాల్టీలను పూర్తిగా రద్దుచేశారు. టెలికం ఆపరేటర్లు స్పెక్ట్రమ్‌ను షేర్‌ చేసుకోవడాన్ని అనుమతించారు. స్పెక్ట్రమ్‌ యూజర్‌ చార్జీలను నెలవారీగా కాకుండా సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు.

బకాయిలపై మారటోరియం

టెలికం కంపెనీలు చట్టబద్దంగా చెల్లించాల్సిన బకాయిల్ని నాలుగేళ్లు వాయిదావేస్తూ మారటోరియం ప్రకటించారు. దీంతో కంపెనీలకు వచ్చే రాబడిని 5జీ నెట్‌వర్క్‌ తదితర ఉత్పాదక కార్యకలాపాలకు ఖర్చుచేసే అవకాశం లభిస్తుంది. అయితే మారటోరియం సమయంలో కంపెనీలు కొద్దిపాటి వడ్డీని చెల్లిస్తే చాలు. అలాగే మారటోరియం ముగిసిన తర్వాత బకాయిల్ని ప్రభుత్వం ఈక్విటీ మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించారు.

భయం లేకుండా పెట్టుబడులు

‘టెలికం రంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా పరిశ్రమ భయం లేకుండా పెట్టుబడులు చేయగలుగుతుంది, ఇండియా డిజిటల్‌ వ్యవస్థకు ఇది మద్దతునిస్తుంది’
-సునీల్‌ మిట్టల్‌, చైర్మన్‌, ఎయిర్‌టెల్‌

‘ఎప్పటినుంచో మేము కోరుతున్న ప్యాకేజిని ఇవ్వడం ఈ రంగానికి పెద్ద ఊరట’
-ఎస్‌పీ కొచ్చార్‌, డైరెక్టర్‌ జనరల్‌, సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌

‘ ఈ ప్యాకేజితో పరిశ్రమ డిజిటల్‌ ఇండియా లక్ష్యాల్ని సాధిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదికి కృతజ్ఞతలు’
-ముకేశ్‌ అంబానీ, చైర్మన్‌ – రిలయన్స్‌

‘ప్రభుత్వం ప్రకటించిన టెలికం సంస్కరణలు ఈ రంగంలో నూతన అధ్యాయం. పరిశ్రమ ఆరోగ్యకర వృద్ధి పట్ల ప్రభుత్వానికున్న కట్టుబాటుకు ఇవి ప్రతిబింబం’

  • కుమార మంగళం బిర్లా, చైర్మన్‌ ఆదిత్యా బిర్లా గ్రూప్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana