సోమవారం 03 ఆగస్టు 2020
Business - Jul 27, 2020 , 00:38:38

గోల్డ్‌ బాండ్స్‌ గోల్డ్‌ పెట్టుబడులకు ఏది ఉత్తమం?

గోల్డ్‌ బాండ్స్‌ గోల్డ్‌ పెట్టుబడులకు ఏది ఉత్తమం?

రాజు, రవి స్నేహితులు. ప్రైవేట్‌ ఉద్యోగులైన వీరికి ఎప్పట్నుంచో పెట్టుబడులపై ఆసక్తి. కానీ స్టాక్‌ మార్కెట్‌ కదలికలను చూసి ధైర్యం చేయలేకపోతున్నారు.ఎట్టకేలకు బంగారంపై మదుపు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే భౌతికంగా బంగారాన్ని కొనాలా?.. డిజిటల్‌ పెట్టుబడులు పెట్టాలా? అన్న ప్రశ్న ఈ మిత్రులను తొలిచేస్తున్నది.ఇలాంటి సందేహాలు రాజు, రవిలకే కాదు. ఇప్పుడు చాలామందికే ఉన్నాయి. ప్రస్తుతం పుత్తడి ధరలు రికార్డు స్థాయిల్లో పరుగులు పెడుతుండటంతో చాలా మంది గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వైపు చూస్తున్నారు.

బంగారం.. కొని వేసుకునే రోజుల నుంచి చూసి సరిపెట్టుకునే రోజులొచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది పసిడి ధరలు ఆ స్థాయిలో పరుగులు పెడుతున్నాయి మరి. రోజుకింత పెరుగుతూ మునుపెన్నడూ లేని రికార్డులను నమోదు చేస్తున్నాయి. దీంతో అందరి చూపు ఇప్పుడు గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పడుతున్నది. అయితే భౌతిక పెట్టుబడులకు దిగాలా?.. డిజిటల్‌ రూపంలో మదుపు చేయాలా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ఎలా మదుపు చేయవచ్చు?

బంగారాన్ని సంపద సృష్టికి కాకుండా, సురక్షిత పెట్టుబడి సాధనంగా మెజారిటీ మదుపరులు చూస్తున్నారు. మార్కెట్‌ ఒడిదుడుకుల్లోనూ పసిడి పెట్టుబడులు స్థిరంగా ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక ఈ పెట్టుబడులు ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి ప్రభావానికి గురికాకుండా ఉంటాయి. ఇక పుత్తడిపై పెట్టుబడులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి భౌతిక రూపంలో, ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ). వీటిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లు పూర్తిగా ఆన్‌లైన్‌ లావాదేవీలతో కూడుకున్నవి. ఇవి బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే భౌతిక రూపంలో బంగారం, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ల్లో ఏది ఉత్తమం అన్నదే చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.

భౌతిక రూపంలో..

దేశంలో బంగారంపై పెట్టుబడులకు చాలామంది భౌతిక రూపాన్నే ఎంచుకుంటున్నారు. ఇందులో ఆభరణాలు, నాణేలు, కడ్డీలు తదితర రూపాల్లో పసిడి నిక్షిప్తమై ఉం టుంది. బంగారాన్ని కొనాలన్నా.. తిరిగి అమ్మాలన్నా సులువుగానే చేయవచ్చు. మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడో.. లేదంటే తనకు అవసరం ఉన్నప్పుడో మదుపరి ఈ పెట్టుబడులపై స్వేచ్ఛగా ఓ నిర్ణయానికి రావచ్చు. బ్రోకర్లు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలతో పని లేదు. దీంతో అటు పెట్టుబడిగానూ, ఇటు అవసరానికి భౌతిక రూపంలో బంగారాన్ని దాచడమే ఉత్తమంగా కనిపిస్తున్నది. అయితే ఈ రూపంలో నాణ్యత సమస్య వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్వచ్ఛతను అంచనా వేయడం వల్ల మదుపరులు కొంత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఈ బంగారం కొనుగోళ్లకు సంబంధించిన ధ్రువపత్రాలను భద్రపరుచుకోవడం మరువరాదు. దీనివల్ల పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌

సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ అనేవి ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు. కేంద్ర ప్రభుత్వం తరఫున వీటిని రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేస్తుంది. ఎస్‌జీబీలు గ్రాము బంగారం చొప్పున జారీ అవుతాయి. ఎక్సేంజీపై ట్రేడ్‌ అవుతాయి. అయితే ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది కాబట్టి మన పెట్టుబడులు భద్రంగానే ఉంటాయి. కానీ ఎనిమిదేండ్ల కాలవ్యవధితో ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. కనీసం ఐదేండ్లదాకా పెట్టుబడుల ఉపసంహరణ ఉండదు. దీనివల్ల సదరు గడువు ముగిసేదాకా మదుపరులు వేచిచూడాల్సిందే. అయినప్పటికీ నగలను తాకట్టుపెట్టి రుణాలను తీసుకున్నట్లే.. ఈ బాండ్లనూ తనఖా పెట్టి అప్పు పొందవచ్చు. స్వచ్ఛత విషయంలోనూ స్పష్టత ఉంటుంది. ఇష్యూ ధరపై 2.5 శాతం వార్షిక వడ్డీని నిర్ణీత వ్యవధి తర్వాత ఆర్నెళ్లకోసారి ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి టీడీఎస్‌ వర్తించదు. మూలధన లాభాల పన్ను నుంచీ మినహాయింపు అవకాశాలున్నాయి. వీటినిబట్టి ఏది మీ పెట్టుబడులకు సరైనదో తేలిగ్గా నిర్ణయించుకోండిక.


logo