సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Mar 15, 2020 , 23:36:01

వ్యాపారానికీ బీమా కావాలి

వ్యాపారానికీ బీమా కావాలి

న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా ప్రభావిత వ్యాపారాలకు బీమా రక్షణను అందించాలని వాణిజ్య సంఘం సీఏఐటీ డిమాండ్‌ చేస్తున్నది. ఈ మేరకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐకి సూచించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఏఐటీ లేఖ రాసింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయని, వీటిని ఆదుకునేలా బీమా కవరేజీ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది. ఇన్సూరెన్స్‌ సంస్థలను ఈ దిశగా ఐఆర్‌డీఏఐ ఆదేశించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ లేఖలో కోరారు. ఇప్పటికే ఉన్న అగ్ని ప్రమాద, మెటీరియల్‌ నష్ట పరిహార పాలసీలకు తోడుగా కరోనా ప్రభావిత వ్యాపార పాలసీలనూ ప్రవేశపెట్టాలన్నారు. 


కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కూ ఈ లేఖను సీఏఐటీ పంపింది. కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు, జిమ్‌లు, సభలు, ర్యాలీలు, ఫంక్షన్లపై తాత్కాలిక నిషేధం విధించగా, ప్రజలు ఇండ్లను వీడి బయటకు రావద్దని సర్కారు సూచిస్తున్నది. దీంతో రోడ్లపై జనాలు లేక వ్యాపారాలు పెద్ద ఎత్తున పడిపోతున్నాయి. కాగా, కరోనా వైరస్‌ చికిత్సకూ కొన్ని సంస్థలు బీమా సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి విదితమే.


logo