బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 02, 2020 , 23:54:53

ఆర్బీఐ పాలసీ కీలకం

ఆర్బీఐ పాలసీ కీలకం
  • క్యూ3 ఫలితాలు, బడ్జెట్‌ నిర్ణయాలు కూడా.. మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

ముంబై, ఫిబ్రవరి 2: బడ్జెట్‌ దెబ్బకు గతవారంలో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుత వారంలోనూ ఒడిదుడుకులు తప్పవని మార్కెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిజర్వుబ్యాంక్‌ తన చివరి పరపతి సమీక్షను ఈవారంలో ప్రకటించనుండటం, దేశ స్థూల ఆర్థికాంశాలు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ వర్గాలను భయకంపితులకు గురిచేసింది. దీంతో గత పదేండ్లలో ఇంతటి స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారి. ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడానికి ఎలాంటి చర్యలు ప్రకటించకపోవడం నిరాశకు గురిచేసిందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. ఈక్విటీ పొదుపు పథకాలపై ఆదాయం పన్ను మినహాయింపులు ఎత్తివేయడం మదుపరుల్లో ఆందోళనలను పెంచిందన్నారు. గురువారం ఆర్బీఐ పరపతి సమీక్షను ప్రకటించనుండగా, తయారీ రంగ సూచీ గణాంకాలు, భారతీ ఎయిర్‌టెల్‌, లుపిన్‌, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రాలు మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 1,877.66 పాయింట్లు పతనం చెందింది. 


బ్లూచిప్‌లకు 1.89 లక్షల కోట్ల నష్టం

గతవారం బ్లూచిప్‌ సంస్థలకు నిరాశనే మిగిల్చింది. తొలి పది బ్లూచిప్‌ సంస్థల్లో ఏడు సంస్థలు ఏకంగా రూ.1.89 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయాయి. వీటిలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా రూ.87,732.80 కోట్లు. గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,877.66 పాయింట్లు నష్టపోయి 40 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. పది లక్షల కోట్ల స్థాయికి దూసుకుపోయిన ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ గతవారంలోనే రూ.87,732.80 కోట్లు పడిపోయి రూ.8,76,906.57 కోట్లకు పరిమితమైంది. వీటితోపాటు రూ. 31,148.40 కోట్లు కోల్పోయిన హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.3,92,618.14 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.24,746 కోట్లు పతనం చెంది రూ.6,56,888.50 కోట్లకు పరిమితమైంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.19,044.70 కోట్లు క్షీణించి రూ.3,26,410.37 కోట్లకు, ఎస్బీఐ రూ.18,652.40 కోట్లు పడిపోయి రూ.2,70,549.60 కోట్లుగా నమోదైంది. టీసీఎస్‌ విలువ కూడా రూ.7,317.15 కోట్లు పతనం చెంది రూ.8,12,428.81 కోట్లకు, ఇన్ఫోసిస్‌ రూ.1,149.83 కోట్లు జారుకొని రూ.3,32,280.10 కోట్ల వద్ద ముగిసింది. కానీ, దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ మాత్రం రూ.2,392.15 కోట్లు అందుకొని రూ.2,71,332.15 కోట్లకు చేరుకున్నది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.1,182 కోట్లు బలపడి రూ.3,15,346.61 కోట్లకు చేరుకోగా, హిందుస్థాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌(హెచ్‌యూఎల్‌) రూ.119.07 కోట్లు మాత్రమే పెరిగి రూ.4,48,895.43 కోట్లకు చేరింది.  


logo