గురువారం 04 మార్చి 2021
Business - Jan 16, 2021 , 22:03:10

వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఇదే టైం: రాజ‌న్‌

వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఇదే టైం: రాజ‌న్‌

న్యూఢిల్లీ: వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డానికి మ‌రో రెండు వారాల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తొలుత ఆర్థిక మంద‌గ‌మ‌నం.. అటుపై కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి విసిరిన స‌వాళ్ల‌తో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్త‌మైంది. పేద‌లు అల్లాడుతుండ‌గా, కార్పొరేట్ సంస్థ‌ల ముంగిట చిన్న మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. 

ప్రాధాన్యాలు నిర్దేశించుకోవాలి

ఈ త‌రుణంలో క‌రోనాతో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న పేద‌ల‌తోపాటు చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు రిలీఫ్ ఇచ్చేందుకు బ‌డ్జెట్‌లో చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌, ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ సూచించారు. నిధుల వినియోగంపై ప్ర‌భుత్వం ప్రాధాన్యాల‌ను నిర్ణ‌యించుకోవాల‌ని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 

మౌలిక వ‌స‌తులతోనే సంస్క‌ర‌ణం

దేశీయంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు నిధులు ఖ‌ర్చు చేయాల‌ని ర‌ఘురామ్ రాజ‌న్ కేంద్రాన్ని కోరారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఏమాత్రం జాప్యం లేకుండా నిధులు విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రాల‌కు నిధులు నిలిపివేయ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాద‌న్నారు. 

వాటాల విక్ర‌యంతోనే రెవెన్యూ లోటు త‌గ్గింపు

స్టాక్ మార్కెట్లు ఉన్న‌త రికార్డులు నెల‌కొల్పుతున్న త‌రుణంలోనే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ర‌ఘురామ్ రాజ‌న్ పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప‌న్ను వ‌సూళ్లు ప‌డిపోయి,  రెవెన్యూ ద్ర‌వ్య‌లోటు త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల విక్ర‌య‌మే కీల‌క ఆదాయ వ‌న‌రు అని వ్యాఖ్యానించారు. 

వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌.. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌

ప్ర‌తి సంస్థ‌లో వాటాల విక్ర‌యంతో అధిక రుణ ప‌ర‌ప‌తి ల‌భిస్తుంద‌ని ర‌ఘురామ్ రాజ‌న్ చెప్పారు. పీఎస్‌యూల్లో వాటాల విక్ర‌యం ద్వారా వ‌చ్చే నిధుల‌ను దేశంలో నూత‌న మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు వినియోగించాల‌న్నారు. మౌలిక వ‌స‌తుల అభివ్రుద్ధితోనే ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌మ‌ని చెప్పారు. అయితే, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో వాటాల‌ను విక్ర‌యించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోయింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo