మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 24, 2021 , 23:30:34

చౌక‌గా వైఫై రూట‌ర్లు, మోడెంలు.. స‌ర్కార్ ప్లాన్‌?!

చౌక‌గా వైఫై రూట‌ర్లు, మోడెంలు.. స‌ర్కార్ ప్లాన్‌?!

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ, దాని అనుబంధ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు, నిపుణుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్ అమ‌లులోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్నెట్‌ను చౌక‌గా వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. అందులో భాగంగా వై-ఫై రూట‌ర్లు, ఇంట‌ర్నెట్ మోడెంల‌పై సుంకాలు, లెవీలు త‌గ్గించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టే బడ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ అంశాన్ని చేర్చార‌ని అధికార వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌తి ఒక్క‌రికీ ఇంట‌ర్నెట్ ప‌రిక‌రాల‌ను చౌక‌గా అందుబాటులోకి తేవ‌డానికి కేంద్రం ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 

దీంతోపాటు ప్ర‌జ‌ల‌కు ఇంట‌ర్నెట్ ప్లాన్ల‌ను మ‌రింత చౌక‌గా అందుబాటులోకి తేవాల‌ని టెలికం ఆప‌రేట‌ర్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోర‌నున్న‌ది. వ‌ర్క్ ఫ్రం హోం ప‌ని చేసే ఇండిపెండెంట్ ప్రొఫెష‌న‌ల్స్‌, చిన్న వ్యాపారుల‌కు ఇది స‌హాయ‌కారిగా ఉంటుంద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆఫీసుల్లో ఇంట‌ర్నెట్ మౌలిక వ‌స‌తులను వాడుకున్న‌ట్లే.. వ‌ర్క్ ఫ్రం హోం టైంలో ఇంటివ‌ద్ద ఇంట‌ర్నెట్ స‌ర్వీసెస్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసేందుకు వీలుగా ఐటీ నిపుణులు వ‌స‌తులు క‌ల్పించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

రిల‌య‌బుల్ ఇంట‌ర్నెట్ మోడెం, స‌రైన వై-ఫై రూట‌ర్‌, స‌రిప‌డా ఇంట‌ర్నెట్ స్పీడ్‌, డేటా ల‌భ్య‌త అందుబాటులో ఉండాల్సి ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌త యూజ‌ర్ల‌కు టెలికం ఆప‌రేట‌ర్లు.. వ‌ర్క్ ఫ్రం హోం ప్లాన్లు, హై డేటా కోటాల‌ను అందుబాటులోకి తేవాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ఇందుకోసం అన్ని ర‌కాల ఇంట‌ర్నెట్ ప‌రిక‌రాల‌ను చౌక‌గా అందుబాటులోకి తీసుకొచ్చే దిశ‌గా వాటిపై సుంకాలు, లెవీలు త‌గ్గించాల‌ని కేంద్రం ప్ర‌తిపాదిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత చౌక ఇంట‌ర్నెట్ మార్కెట్ అంటే గుర్తుకు వ‌చ్చేది భార‌త్ మాత్ర‌మే. గిగాబైట్ డేటా కేవ‌లం మూడు రూపాయ‌ల‌కే ల‌భిస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo