ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 02, 2021 , 18:06:09

క‌స్ట‌మ్ డ్యూటీ త‌గ్గిస్తే.. బంగారం ధర దిగి వ‌స్తుందా?!

క‌స్ట‌మ్ డ్యూటీ త‌గ్గిస్తే.. బంగారం ధర దిగి వ‌స్తుందా?!

న్యూఢిల్లీ: బ‌ంగారం అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్టం.. పెండ్లిండ్లు, కుటుంబ వేడుక‌ల్లోనూ, సాధార‌ణ టైంలోనూ బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే, మ‌న అవ‌స‌రాల‌కు ప‌సిడి కొనాలంటే విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిందే. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో దూసుకొచ్చిన అనిశ్చితి వ‌ల్ల ప‌ట్టుకుంటేనే షాక్ కొడుతుందా?! అన్న చందాన బంగారం ధ‌ర పైపైకి దూసుకెళ్లింది. ఈ త‌రుణంలో వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మ‌ర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ప‌సిడి, వెండి దిగుమ‌తుల‌పై ఇప్ప‌టివ‌ర‌కు విధించిన దిగుమ‌తి సుంకం 12.5 నుంచి 7.5 శాతానికి త‌గ్గించారు.. అయితే, మ‌రోవైపు వ్య‌వ‌సాయ సెస్ పేరిట 2.5 శాతం ప‌న్ను విధించారు. అయితే, నిక‌రంగా ప‌సిడి, వెండిపై దిగుమ‌తి సుంకం 12.5 నుంచి 7.5 శాతానికి త‌గ్గింది. 

బంగారం, వెండి ధ‌ర‌లిలా..

సుంకం త‌గ్గించ‌డంతో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర సుమారు రూ.1200, కిలో వెండి ధ‌ర రూ.1,750 త‌గ్గింది. బంగారం ఆభ‌ర‌ణాలు కొనేవారికి డ్యూటీ క‌ట్‌తో బెనిఫిట్ అవుతుంది. అయితే, క‌స్ట‌మ్స్ సుంకం త‌గ్గింపు.. ఫిజిక‌ల్ గోల్డ్ లేదా బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోలు చేయ‌డంతోపాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆప్ష‌న్? గా ‌నిలుస్తుందా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. 

సుంకాల హేతుబద్దీక‌ర‌ణ ఇలా..

ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ నినాద‌మే ప్ర‌ధానంగా సాగిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెండి, బంగారం దిగుమ‌తిపై సుంకాల‌ను హేతుబ‌ద్ధీక‌రిస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. మంగ‌ళ‌వారం అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో అస్థిరంగా కొన‌సాగాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ధ‌ర‌ రూ.320 న‌ష్ట‌పోయి  రూ.49,640కి త‌గ్గింది. 

ఆక‌ర్ష‌ణీయం కాదంటున్న బులియ‌న్ విశ్లేష‌కులు

పెట్టుబ‌డికి బంగారు ఆభ‌ర‌ణాలు కొన‌డం ఆక‌ర్ష‌ణీయ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్ కానేకాద‌ని బులియ‌న్ మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. కేవ‌లం వినియోగం కోసం మాత్ర‌మే కొనాల‌ని అతివ‌ల‌కు సూచిస్తున్నారు. ఇన్వెస్‌మెంట్ చేసే వారికి నేరుగా బంగారం కొనుగోలు చేయ‌డం కంటే భార‌తీయ రిజ‌ర్వుబ్యాంక్ (ఆర్బీఐ) జారీ చేసే సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కొనుగోలు చేయ‌డ‌మే ఎల్ల‌వేళలా మెరుగైన ఆప్ష‌న్ అని పేర్కొంటున్నారు. ప్ర‌స్తుత ప‌సిడి విలువకు అనుగుణంగా ఎస్జీబీని ఇన్వెస్ట‌ర్ కొంటే, మెచ్యూరిటీ టైంలో ధ‌ర‌కు అనుగుణంగా డ‌బ్బు తీసుకోవ‌చ్చు.

అనిశ్చితిలో పెట్టుబ‌డి ఆప్ష‌న్ ప‌సిడి

క‌రోనాతో రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం ధ‌ర‌.. ఇంత‌కుముందు 2008 ఆర్థిక మాంద్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పైపైకే దూసుకెళ్తోంది త‌ప్ప త‌గ్గ‌లేదు.. అమెరికా-చైనా మ‌ధ్య వాణిజ్య యుద్ధం.. ఆర్థిక మంద‌గ‌మ‌నం.. తాజాగా క‌రోనా ప్ర‌భావంతో తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు చేరువ‌లో కొన‌సాగుతున్న‌ది. మున్ముందు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ ప్ర‌క‌టించే ఉద్దీప‌న చ‌ర్య‌ల వ‌ల్ల డాల‌ర్ బ‌లహీన ప‌డితే ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి ఆప్ష‌న్‌గా ఇన్వెస్ట‌ర్ల‌కు మిగిలింది కేవ‌లం బంగార‌మే. 

ఆభ‌ర‌ణాలు కొంటే నో ఇంట‌రెస్ట్‌

బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేస్తే వ‌డ్డీ ల‌భించ‌దు. కానీ ఎస్జీబీల‌ను కొనుగోలు చేస్తే, పెట్టుబ‌డి మొత్తంపై ఏటా 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసిన‌ప్పుడు మేకింగ్ చార్జీల పేరిట ధ‌ర‌పై అద‌నంగా 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ అమ్ముకోవాల్సి వ‌స్తే కేవ‌లం బంగారం విలువ మాత్ర‌మే వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. దీన్ని బ‌ట్టి బంగారం కొనుగోలు స‌మ‌యంలో చెల్లించిన 20 శాతం మొత్తం వృథా అవుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్ రిట‌ర్న్స్ త‌గ్గుతాయి. 

ప‌సిడి కొంటే క్యాపిట‌ల్ గెయిన్ టాక్స్ ప‌క్కా

మీరు ప‌సిడి కొనుగోలు చేసిన‌ప్పుడు క్యాపిట‌ల్ గెయిన్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఎస్జీబీల‌కు అవి మెచ్యూర్ అయ్యే వ‌ర‌కు ఆ నిబంధ‌న వ‌ర్తించ‌దు కానీ.. సెకండ‌రీ మార్కెట్‌లో విక్ర‌యించిన‌ప్పుడు మాత్రం దాని విలువపై క్యాపిట‌ల్ గెయిన్ టాక్స్ త‌ప్ప‌నిస‌రిగా చెల్లించాల్సిందే. బంగారం, వెండిపై సుంకాల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు కేంద్ర విత్త‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన‌ప్పటి నుంచి దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో వాటి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ ధ‌ర తులానికి రూ.48 వేల‌ల్లో, వెండి కిలో ధ‌ర 70,500 మ‌ధ్య కొన‌సాగుతోంది. హైద‌రాబాద్‌, విశాఖ‌ల్లో కిలో వెండిధ‌ర రూ.79, 200 ప‌లుకుతోంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo