బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 26, 2020 , 00:30:01

దిగుమతులు భారం!

దిగుమతులు భారం!
  • 50కిపైగా ఉత్పత్తులపై సుంకాల పెంపు
  • బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ, జనవరి 25: దిగుమతి సుంకాలను పెంచాలని యోచిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌, రసాయనాలు, హస్తకళలు తదితర 50కిపైగా ఉత్పత్తులపై దిగుమతి సుంకాల పెంపు ఉండొచ్చని సంబంధిత వర్గాల సమాచారం. చైనా తదితర దేశాల నుంచి భారత్‌కు వస్తున్న దాదాపు 56 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులే లక్ష్యంగా ఈ పెంపులుంటాయని తెలుస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ఈ దిగుమతి సుంకాల పెంపు ప్రకటన ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌ చార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, విద్యుద్దీపాలు, కలప ఫర్నీచర్‌, క్యాండిల్స్‌, ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తులు వంటివి ప్రియం కానున్నాయి. ‘ప్రాధాన్యత లేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడమే మా లక్ష్యం. దిగుమతి సుంకాల పెంపుతో చైనా, ఆగ్నేయాసియా దేశాల సంఘం, ఇతరత్రా దేశాల నుంచి వస్తున్న దిగుమతులతో దెబ్బ తింటున్న భారతీయ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుతుంది’ అని ఓ అధికారి అన్నారు. 5 శాతం నుంచి 10 శాతం మేర పెంపు ఉండవచ్చని మరో అధికారి తెలిపారు. నిజానికి స్థానిక పరిశ్రమలతో వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారుల కమిటీ సంప్రదింపులు జరిపి సుమారు 100 బిలియన్‌ డాలర్ల విలువైన 130కిపైగా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత సగానికి కుదించారని వెల్లడించారు. మరోవైపు ఇటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, అటు వాణిజ్య మంత్రిత్వ శాఖల అధికార ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.


మొబైల్‌ ధరలకు రెక్కలు

దేశీయంగా మొబైల్‌ ఫోన్లు తయారవుతున్నా.. ఇప్పటికీ చార్జర్లు, వైబ్రేటర్‌ మోటర్లు, రింగర్లు వంటి ఇతరత్రా విడి భాగాలు విదేశాల నుంచే దేశంలోకి దిగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్‌లో దిగుమతి సుంకాలు పెరిగితే మొబైల్‌ ఫోన్‌ తయారీ ఖర్చులు ప్రభావితం కానున్నాయి. పెరిగే ఉత్పాదక వ్యయం దృష్ట్యా మొబైల్‌ ఫోన్ల ధరలను ఆయా సంస్థలు పెంచే అవకాశాలే ఎక్కువని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ నిర్ణయం మొబైల్‌ ఫోన్ల అమ్మకాలను ప్రభావితం చేయవచ్చన్న ఆందోళనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ రంగం వృద్ధిరేటు ప్రకారం సుంకాలు తప్పవన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మందగమనంలోనూ మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.


విదేశీ పెట్టుబడులపై ప్రభావం

దిగుమతి సుంకాల పెంపుతో దేశంలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఐకియా.. భారతీయ కస్టమ్స్‌ సుంకాలు అధికంగా ఉన్నాయంటున్నది. ఈ నేపథ్యంలో తీవ్రతరమయ్యే సుంకాల భారం.. దేశంలో ఐకియా పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికల్ని ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. 2014లో కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దిగుమతులపై పలు రకాల ఆంక్షలు పెట్టారు. దేశీయంగా తయారీని పెంచడానికి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. అయితే దిగుమతి సుంకాల పెంపు మాత్రం ఇక్కడి విదేశీ సంస్థలకు కొంత ఇబ్బందేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కింద చౌకగా దిగుమతి అవుతున్న ఉత్పత్తులే లక్ష్యంగా వడ్డింపులు ఉండవచ్చని బీజేపీ ఆర్థిక వ్యవహారాల సెల్‌ అధిపతి గోపాల్‌ కృష్ణన్‌ అగర్వాల్‌ అన్నారు.


నాణ్యతపై దృష్టి

దిగుమతులపై నాణ్యతా ప్రమాణాలను విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు బడ్జెట్‌ సంప్రదింపుల్లో పాల్గొంటున్న ఓ పరిశ్రమ అధికారి చెప్పారు. ఇక వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం సరిహద్దు సవరణ పన్ను (బ్యాట్‌)ను పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. గతేడాది జూలైలో 75కుపైగా ఉత్పత్తులపై ప్రభుత్వం దిగుమతి పన్నును పెంచింది. వీటిలో బంగారం, ఆటోమొబైల్‌ విడిభాగాలు తదితర ఉత్పత్తులున్నాయి. కాగా, దిగుమతులను తగ్గించాలని కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గత కొన్నేండ్లుగా ఎగుమతుల కంటే వేగంగా పెరుగుతున్న దిగుమతులు.. ఈ ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంలో 8.90 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో ఎగుమతులు దాదాపు 2 శాతం క్షీణించాయని అంచనా. ఈ క్రమంలోనే గతంతో పోల్చితే ఏప్రిల్‌-డిసెంబర్‌లో వాణిజ్య లోటు 148 బిలియన్‌ డాలర్ల నుంచి 118 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది.


logo