బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 24, 2020 , 00:20:24

పోరుబాటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

పోరుబాటలో బీఎస్‌ఎన్‌ఎల్‌
  • నేడు దేశవ్యాప్తంగా ఉద్యోగుల నిరాహారదీక్ష

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.69 వేల కోట్ల పునరుద్దరణ ప్యాకేజీ ఆలస్యమవుతుండటానికి కారణంగా కంపెనీ ఉద్యోగుల ఆందోళన బాటపట్టారు. సోమవారం దేశవ్యాప్తంగా ఒక్కరోజు పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి కేంద్ర క్యాబినెట్‌ ప్రకటించిన రూ.68,751 కోట్ల పునరుద్దరన ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24న ఒక్కరోజు నిరాహార దీక్షకు పునుకుంటున్నట్లు ఆల్‌ యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌(ఏయూఏబీ) ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అక్టోబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఎంటీఎన్‌ఎల్‌ను విలీనం చేయడంతోపాటు రూ.68 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. వీటితోపాటు సావరిన్‌ గ్యారంటీ కింద ఇరు సంస్థలు రూ.15 వేల కోట్ల నిధులను దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయడం ద్వారా సేకరించడానికి కూడా అనుమతినిచ్చింది. ఈ రిలీఫ్‌ ప్యాకేజీ అందకపోవడంతో సరైన సమయంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని, వీఆర్‌ఎస్‌ కింద దాఖలు చేసుకున్న 78,569 మంది సిబ్బంది ఇప్పటికే విధులకు దూరమయ్యారని, వీరికి కూడా ఎలాంటి నిధులు చెల్లించలేదని ఏయూఏబీ వర్గాలు ఆరోపిస్తున్నారు. 

4జీ సేవలు ఈ ఏడాది కష్టమే..

ఇతర పోటీ టెలికం సంస్థలు 4జీ సేవలు ఆరంభించి దూకుడును ప్రదర్శిస్తుంటే ప్రభుత్వరంగ సంస్థయైన బీఎస్‌ఎన్‌ఎల్‌ వెనుకబడిపోయింది. ఈ ఏడాది కూడా 4జీ సేవలు అందించే అవకాశాలు లేవని తెలిపోయింది. ఇప్పటి వరకు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించకపోవడం, మరోవైపు ఇతర టెలికం సంస్థలు ఏజీఆర్‌ బకాయిలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందడం లేదు. ఒకవైపు నిధుల లేమి, మరోవైపు ప్రభుత్వం పట్టిచ్చుకోకపోవడం సమస్యలు మరింత ముదిరి పాకానపడ్డాయి. కంపెనీని ఆదుకోవడానికి టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ గట్టిగానే కృషి చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. అలాగే, గత పది నెలలుగా కాంట్రాక్ట్‌ కార్మికులకు జీతాలు చెల్లించలేని స్థితికి బీఎస్‌ఎన్‌ఎల్‌ చేరుకున్నదని ఏయూఏబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


logo
>>>>>>