ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 01, 2020 , 23:18:29

కరోనానే కీలకం!

కరోనానే కీలకం!
  • స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, మార్చి 1: కరోనా వైరస్‌ దెబ్బకు గతవారంలో కుదేలైన ప్రపంచ మార్కెట్లు ఈ వారంలోనూ మరింత పడిపోయి ప్రమాదం ఉన్నదని మార్కెట్‌ వర్గాలు హెచ్చరిస్తున్నారు. 2008 సంభవించిన ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక వారంలో భారీగా నష్టపోయిన సూచీలు మళ్లీ గతవారంలో మూడు వేల పాయింట్ల వరకు పతనమయ్యాయి. ఈ వారంలోనూ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చునని, కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు పాకుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మరింత తీవ్రతరంకానున్నదని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశ వృద్ధిరేటు ఏడేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికిగాను 4.7 శాతంగా నమోదైంది. బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)కి చెందిన అనుబంధ సంస్థయైన కార్డు సంస్థ ఐపీవోకి రానుండటం, ఆఫర్‌ ఫర్‌ రూట్‌లో రిట్స్‌లో కేంద్ర ప్రభుత్వం వాటాను విక్రయించనుండటంపై కూడా దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు ప్రత్యేకంగా దృష్టిసారించే అవకాశాలున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 2,872.83 పాయింట్లు లేదా 6.97 శాతం, నిఫ్టీ 879.10 పాయింట్లు లేదా 7.27 శాతం పతనం చెందాయి.


logo