సోమవారం 13 జూలై 2020
Business - May 28, 2020 , 20:10:10

బోయింగ్‌లో ఉద్యోగులపై వేటు

బోయింగ్‌లో ఉద్యోగులపై వేటు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. విమానయాన రంగం కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై పలు సంస్థలు దృష్టిసారించాయి. 12 వేల మందిని తొలగించేందుకు అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగాల సంఖ్యను తగ్గించుకొనేందుకు  యోచిస్తున్నామని బోయింగ్‌ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. 

కరోనా వైరస్‌ అన్నింటిపై ప్రభావం చూపించినట్లుగానే విమానాల పరిశ్రమపై కూడా ప్రభావం చూపింది. దాంతో విమానయాన పరిశ్రమ ఘోరంగా దెబ్బతిని, రానున్నరోజుల్లో వాణిజ్య జెట్‌ల తయారీని తగ్గించనున్నట్టు తమ సిబ్బందికి పంపిన లేఖలో బోయింగ్‌ సీఈవో డేవిడ్‌ కాల్హౌన్‌ పేర్కొన్నారు. తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకొనేందుకు యోచిస్తున్నట్టు డేవిడ్‌ చెప్పారు. ఈ వారంలో 6,750 మందిని తొలగించేందుకు సంస్థ ప్రణాళికలు చేయగా.. మరో 5,500 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. 


logo