ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 29, 2020 , 23:56:45

బోయింగ్‌ నష్టం 636 మిలియన్‌ డాలర్లు

బోయింగ్‌ నష్టం 636 మిలియన్‌ డాలర్లు
  • 1997 తర్వాత ఇదే తొలిసారి

న్యూయార్క్‌, జనవరి 29: ప్రపంచ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిన బోయింగ్‌కు ఆర్థిక ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక సమస్యలతో కంపెనీకి చెందిన 737 మ్యాక్స్‌ నేలపట్టునే నిలిచిపోవడంతో సంస్థ తొలిసారిగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. గతేడాది నాలుగో త్రైమాసికానికిగాను సంస్థ బిలియన్‌ డాలర్ల నష్టాన్ని ప్రకటించిన సంస్థ..మొత్తం ఏడాదికిగాను 636 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. 1997 తర్వాత ఇంతటి భారీ స్థాయి నష్టాలను ప్రకటించడం ఇదే తొలిసారి. కంపెనీ సీఈవోగా నియమితులైన డేవిడ్‌ కాల్‌హౌన్‌ మాట్లాడుతూ...ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు, మ్యాక్స్‌ విమానాల తెచ్చిన నష్టం అక్షరాల 9.2 బిలియన్‌ డాలర్లు అని ఆయన పేర్కొన్నారు.  నాలుగో త్రైమాసికంలో ఆదాయం 36.8 శాతం తగ్గి 17.9 బిలియన్‌ డాలర్లకు పడిపోగా, మొత్తం ఏడాదికిగాను 24.3 శాతం క్షీణించి 76.6 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చింది. గతేడాది మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా రెండు మ్యాక్స్‌ విమానాలు కూలిపోవడంతో 346 మంది సజీవ సమాది అయ్యారు. దీంతో బోయింగ్‌ విమానాల భద్రతపై అనుమానాలు తీవ్రతరమయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మ్యాక్స్‌ విమానాల ఉత్పత్తిని నిలిపివేసిన సంస్థ..ఇతర వాటిలోనూ కోత విధించింది. ఇలా ఉత్పత్తిని తగ్గించడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. 2021 నుంచి 2023 వరకు నెలకు ఉత్పత్తి అవుతున్న విమానాల్లో 10కి తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. చైనా నుంచి ఆర్డర్లు తగ్గుముఖం పట్టడంతో గత అక్టోబర్‌లో ఉత్పత్తిని 14 నుంచి 12కి తగ్గించిన సంస్థ ఈ సారి దీనిని పదికి కుదించింది. వీటిలో 787 డ్రీమ్‌లైనర్‌, 737 మ్యాక్స్‌లు ఉన్నాయి.  కంపెనీ షేరు విలువ 2.4 శాతం పెరిగి 324.25 డాలర్లకు చేరుకున్నది. logo