శనివారం 06 జూన్ 2020
Business - May 03, 2020 , 02:08:18

ఎంఎస్‌ఎంఈలకు బీవోబీ బాసట

ఎంఎస్‌ఎంఈలకు బీవోబీ బాసట

ముంబై, మే 2: కరోనా వైరస్‌ ధాటికి ఆర్థికంగా చితికిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు బాసటగా నిలిచింది ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలను కలుసుకుని, వారి సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలను సూచించింది. లాక్‌డౌన్‌తో చాలా ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక ఇబ్బందులు వచ్చిపడిన విషయం తెలిసిందే. ఉత్పత్తి లేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, రుణ భారాన్ని మోయలేక అవస్థలు పడుతున్న సంగతీ విదితమే. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ చర్యలకు అనుగుణంగా బీవోబీ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే బ్యాంక్‌ అందిస్తున్న ప్రయోజనాల గురించి ఎంఎస్‌ఎంఈ రుణగ్రహీతలతోపాటు బ్యాంక్‌ జనరల్‌, జోనల్‌, రీజినల్‌, బ్రాంచ్‌ మేనేజర్లతో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాధిత్య సింగ్‌ వెబినార్‌ నిర్వహించారు. బ్యాంక్‌ అందిస్తున్న వ్యాపారావకాశాలను అందిపుచ్చుకోవాలని సింగ్‌ ఎంఎస్‌ఎంఈలను కోరారు. ఈ సందర్భంగా దాదాపు 49 వేల రుణగ్రహీతల సందేహాలనూ తీర్చారు.


logo