ఆదివారం 01 నవంబర్ 2020
Business - Sep 22, 2020 , 03:05:06

బ్లాక్‌ మండే... రూ.4 లక్షల కోట్లు ఆవిరి

బ్లాక్‌ మండే... రూ.4 లక్షల  కోట్లు ఆవిరి

ముంబై, సెప్టెంబర్‌ 21: దేశీయ స్టాక్‌ మార్కెట్లు  కుప్పకూలాయి. మధ్యాహ్నం వరకు సాఫీగా సాగిన మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. దీనికితోడు దేశీయంగా రోజురోజుకు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో మరోమారు లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉండటం మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు వెల్లడించాయి.  దీంతో మార్కెట్లకు సోమవారం బ్లాక్‌మండేగా నిలిచింది. 38,812 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 38,990 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇంట్రాడేలో 38 వేల దిగువకు 37,938కి జారుకున్నది. చివరకు 811.68 పాయింట్లు లేదా 2.09 శాతం క్షీణించి 38,034.14 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 254.40 పాయింట్లు లేదా 2.21 శాతం పతనమై 11,250.55 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.4 లక్షలకోట్లకు పైగా సంపదను కోల్పోయారు. బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్‌ విలువ రూ.4,23,139.78 కోట్లు తగ్గి రూ.1,54,76,979.16 కోట్లకు పడిపోయింది. భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో అన్ని రంగాల షేర్లు నేలచూపులు చూశాయి. టెలికం, రియల్టీ, మెటల్‌, ఆటో, హెల్త్‌కేర్‌ రంగ షేర్లు ఆరు శాతం వరకు నష్టపోయాయి.  స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమైనప్పటికీ రూపాయి మాత్రం కోలుకున్నది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 7 పైసలు పెరిగి 73.38 వద్ద నిలిచింది. 

ప్రపంచ మార్కెట్లు: 

దేశీయ మార్కెట్లను ప్రపంచ మార్కెట్లు దగ్గరుండి పడేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన సంకేతాలకు తోడు యూరప్‌లో మరోమారు లాక్‌డౌన్‌ ప్రకటించనున్నారన్న వార్తలు  పరోక్షంగా కారణమయ్యాయి. 

కరోనా కేసులు: 

తాజాగా దేశవ్యాప్తంగా 86 వేల కరోనా కేసులు నమోదవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే  అత్యధిక మంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 

ముగియనున్న ఎఫ్‌అండ్‌వో:

ప్రస్తుత నెలకుగాను ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) గడువు ఈవారంలోనే ముగియనుండటంతో మదుపరులు ముందుజాగ్రత్తగా అమ్మకాలకు మొగ్గుచూపారు

క్షీణించిన షేర్లు:

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా, మారుతి, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌, ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, టైటాన్‌, ఎస్బీఐ, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు క్షీణించాయి.

లాభపడిన షేర్లు:

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.