లండన్: వర్చువల్ కరెన్సీగా దూకుడు ప్రదర్శిస్తున్న క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో రికార్డుల మోత మోగిస్తున్నది. శనివారం మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్‌లో లండన్ కాలమానం ప్రకారం 12.22 గంటలకు 60,012 డాలర్ల మార్క్‌ను దాటేసింది. డిజిటల్ కరెన్సీగా విపణిలోకి అడుగు పెట్టిన తర్వాత బిట్ కాయిన్ సాధించిన ఆల్‌టైం రికార్డు ధర ఇదే. గత నెల 21న 58,354.14 డాలర్లతో తాను ఈ ఏడాది నమోదు చేసిన తొలి ఆల్‌టైమ్ రికార్డునే బిట్ కాయిన్ బ్రేక్ చేసింది. గత నెల నుంచి బిట్‌కాయిన్ విలువ రెండు శాతానికి పైగా గ్రోత్ సాధించింది.
క్రిప్టో కరెన్సీలకు క్రెడిట్ కార్డ్ జెయింట్ మాస్టర్ కార్డుతోపాటు వీసా, ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పే పాల్, బ్లాక్ రాక్ ఇంక్ అసెట్ మేనేజర్ బీఎన్వై మెల్లొన్, మైక్రో స్ట్రాటర్జీ ఇంక్, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తదితర కార్పొరేట్లు దన్నుగా నిలబడటంతో బిట్ కాయిన్ విలువ రోజురోజుకు పెరిగిపోతున్నదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనికితోడు కరోనా నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజాన్నిచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన 1.9 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ కూడా బిట్ కాయిన్ విలువ పెరిగిపోవడానికి మరో కారణం.