శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 18, 2021 , 01:54:49

లక్ష డాలర్లకు బిట్‌కాయిన్‌!

లక్ష డాలర్లకు బిట్‌కాయిన్‌!

  • రోజురోజుకూ క్రిప్టోకరెన్సీ దూకుడు
  • 51,500 డాలర్లకు చేరిక
  • భారీ అంచనాలతో పెరుగుతూపోతున్న విలువ 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: బిట్‌కాయిన్‌ దూకుడు కొనసాగుతున్నది. రోజుకో రికార్డు స్థాయిని తాకుతూ ఇప్పటికే 50వేల డాలర్ల మార్కును దాటిన ఈ క్రిప్టోకరెన్సీ.. త్వరలోనే లక్ష డాలర్లకు సైతం చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం తొలిసారి 50,000 డాలర్ల స్థాయిని అధిగమించిన బిట్‌కాయిన్‌.. ఆ తర్వాత 51,300 డాలర్లను చేరింది. బుధవారం 51,500 డాలర్లు పలికింది. దీంతో బిట్‌కాయిన్‌ పరుగులు తాత్కాలికం కావని, స్థిరంగా లక్ష డాలర్లను చేరగలదని మార్కెట్‌ వర్గాలు ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నాయి.

బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌పై పన్నులు

బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌, లాభాలపై కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే క్రిప్టోకరెన్సీ బిల్లును తెస్తున్న మోదీ సర్కారు.. బిట్‌కాయిన్‌సహా అన్ని డిజిటల్‌ కరెన్సీల లావాదేవీలపై పన్నులు వేయాలని చూస్తున్నట్లు ఓ సీనియర్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. ఈ మేరకు వీలైనంత త్వరలోనే ప్రభుత్వం నుంచి ఓ సర్క్యులర్‌ విడుదల కానుందన్నారు. 18 శాతం జీఎస్టీతోపాటు వ్యక్తిగత పన్ను ఉండొచ్చన్నారు. క్రిప్టో ట్రేడింగ్‌కు కళ్లెం వేయడానికి ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచే ఈ పన్నులను వర్తింపజేయవచ్చని సదరు అధికారి సంకేతాలిచ్చారు.

ఏమిటీ బిట్‌కాయిన్‌?

బిట్‌కాయిన్‌ అనేది ఓ డిజిటల్‌ కరెన్సీ లేదా అదృశ్య (కిప్టో) కరెన్సీ. 2009 జనవరిలో దీన్ని సృష్టించారు. దీని రూపకర్తగా సటోషి నకమోటో పేరు వినిపిస్తున్నది. అయితే ఇప్పటికీ బిట్‌కాయిన్‌ టెక్నాలజీ సృష్టి రహస్యంగానే ఉన్నది. ప్రభుత్వ కరెన్సీల మాదిరిగా దీనికి నియంతృత్వ వ్యవస్థ లేదు. భౌతిక రూపం లేని ఓ ఊహాజనిత కరెన్సీ ఇది. మదుపరుల ఖాతాల్లో మాత్రమే కనిపించే దీని విలువ ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ.37.06 లక్షలపైనే. 

ఎందుకీ పెరుగుదల‌?

బిట్‌కాయిన్‌ విలువ ఈ స్థాయిలో పెరుగడం వెనుక సంస్థాగత మదుపరుల పాత్రే ఉన్నది. టెస్లా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్‌, మైక్రోస్ట్రాటజీ వంటి గ్లోబల్‌ దిగ్గజ కంపెనీలు.. క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా తమ పాలసీలను మార్చేస్తున్నాయి. దీంతో సహజంగానే క్రిప్టోకరెన్సీల్లో అగ్రస్థానంలో ఉన్న బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారిగా పరుగందుకున్నది. భవిష్యత్తులో దీని లావాదేవీలు అంతటా ఉంటాయన్న అంచనాల మధ్య బిట్‌కాయిన్‌ను కొనేందుకు అందరూ అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా బిట్‌కాయిన్‌ విలువ ఆకాశాన్ని అంటింది. గూగుల్‌ పే, సామ్‌సంగ్‌ పే సంస్థలూ ‘బిట్‌పే’ ద్వారా క్రిప్టోకరెన్సీ వైపు నడుస్తున్నాయని దేశంలోని అతిపెద్ద క్రిప్టోఎక్సేంజ్‌ కాయిన్‌డీసీఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుమిత్‌ గుప్తా అంటున్నారు. గతేడాది బిట్‌కాయిన్‌ విలువ 313 శాతం ఎగబాకడం గమనార్హం.

VIDEOS

logo