సోమవారం 01 మార్చి 2021
Business - Feb 13, 2021 , 03:01:45

బిట్‌కాయిన్‌ బూమ్‌

బిట్‌కాయిన్‌ బూమ్‌

  • ఒక్కదాని విలువ రూ.35.27 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: బిట్‌కాయిన్‌.. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో రారాజు. ఎవరి మద్దతు లేకుండానే పరుగులు పెట్టిన ఈ డిజిటల్‌ కరెన్సీకి ఇప్పుడు గ్లోబల్‌ ఆర్థిక దిగ్గజాల అండ లభిస్తున్నది. ఇంకేముంది ఆకాశమే హద్దుగా దీని విలువ పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం ఒక్క బిట్‌కాయిన్‌ విలువ 48,481 డాలర్లు. భారతీయ కరెన్సీలో ఇది రూ.35.27 లక్షలతో సమానం. గురువారం ఒక్కరోజే బిట్‌కాయిన్‌ విలువ 8 శాతానికిపైగా ఎగబాకడం గమనార్హం. దీంతోనే మునుపెన్నడూ లేని గరిష్ఠానికి బిట్‌కాయిన్‌ విలువ చేరిపోయింది. అయితే ఈ ఆల్‌టైమ్‌ హై రికార్డుకు కారణం లేకపోలేదు. బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెల్లాన్‌, మాస్టర్‌కార్డ్‌.. సరికొత్త క్రిప్టోకరెన్సీ ప్రాజెక్టులతో బిట్‌కాయిన్‌ మరింత ఆకర్షణీయంగా మారిపోయింది.

క్రిప్టో లావాదేవీలకు సై

డిజిటల్‌ ఆస్తుల జారీ, నిర్వహణ, బదిలీలకు సంబంధించి క్లయింట్లకు మద్దతుగా బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెల్లాన్‌ ఇప్పటికే ఓ అంతర్గత విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్‌ అసెట్స్‌ యూనిట్‌ కార్యకలాపాలను ఈ ఏడాది చివరికల్లా పూర్తిస్థాయిలో బ్యాంక్‌ విస్తరించనున్నది. మరోవైపు తమ నెట్‌వర్క్‌పై కొన్ని క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలకు మాస్టర్‌కార్డ్‌ వినియోగదారులను అనుమతించనున్నామని సదరు సంస్థ ప్రకటించింది. ఇందులో బిట్‌కాయిన్‌ తప్పనిసరిగా ఉంటుందన్నది మార్కెట్‌ అంచనా. ఇప్పటికే మాస్టర్‌కార్డ్‌ తమ కస్టమర్లకు ఎక్స్‌టర్నల్‌ వేదికల ద్వారా డిజిటల్‌ కరెన్సీ ఖర్చులకు అనుమతిస్తున్నది. దీంతో బిట్‌కాయిన్‌పై మదుపరుల దృష్టి మరింతగా మళ్లింది. మొత్తానికి బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మెల్లాన్‌, మాస్టర్‌కార్డ్‌ల ప్రకటనలు.. బిట్‌కాయిన్‌ విలువను పరుగులు పెట్టిస్తున్నాయి.

VIDEOS

logo