మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 26, 2021 , 01:45:30

బియానీని అరెస్టు చేయాలి

బియానీని అరెస్టు చేయాలి

  • వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి
  • ఫ్యూచర్‌-రిలయన్స్‌ డీల్‌ అమలును నిలిపేయాలి
  • ఢిల్లీ హైకోర్టులో అమెజాన్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ, జనవరి 25: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య కుదిరిన ఒప్పందంపై అమెరికా ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ కోర్టుకెక్కింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ సీఈవో కిశోర్‌ బియానీ, ఆయన కుమార్తె అష్నీతోపాటు ఆ గ్రూపు వ్యవస్థాపకులను అరెస్టు చేయాలని కోరింది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంతేకాకుండా ఫూచర్‌ గ్రూప్‌ తన రిటైల్‌ ఆస్తులను రిలయన్స్‌కు అమ్మకుండా అడ్డుకోవాలని విన్నవించింది. స్థిర, చరాస్తుల వివరాలను ప్రకటించాల్సిందిగా బియానీ కుటుంబాన్ని ఆదేశించి ఆ ఆస్తులను జప్తు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. రూ.24,713 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలంటూ గతేడాది అక్టోబర్‌లో సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన తాత్కాలిక తీర్పును అమలు చేయాలని అమెజాన్‌ కోరింది. ఫ్యూచర్‌-ఆర్‌ఐఎల్‌ ఒప్పం దం అమలుకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా), స్టాక్‌ మార్కెట్లు అనుమతించిన కొద్ది రోజులకే అమెజాన్‌ ఈ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఎస్‌ఐఏసీ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌ జారీచేసిన తాత్కాలిక తీర్పు భారతీయ చట్టాల ప్రకారం అమలుకు యోగ్యమైనవేనని అమెజాన్‌ తన పిటిషన్‌లో విన్నవించింది. 

న్యాయ పోరాటం చేస్తాం: ఫ్యూచర్‌ రిటైల్‌

కాగా, ఈ పిటిషన్‌పై న్యాయ పోరాటం చేస్తామని, అమెజాన్‌ వాదనను సమర్థంగా తిప్పికొడతామని ఫ్యూచర్‌ రిటైల్‌ సంస్థ స్పష్టం చేసింది. ‘ఢిల్లీ హైకోర్టులో అమెజాన్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆ కంపెనీ లాయర్ల నుంచి మాకు సమాచారం అందింది. ఈ పిటిషన్‌పై మా న్యాయవాదుల ద్వారా పోరాటం సాగిస్తాం. మా వాదనను సమర్థంగా వినిపిస్తాం’ అని ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది. 

VIDEOS

logo