గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 17, 2020 , 23:59:10

ఎయిర్‌టెల్‌ @ 10 వేల కోట్లు

ఎయిర్‌టెల్‌ @ 10 వేల కోట్లు
  • ఏజీఆర్‌ బకాయిలు చెల్లించిన సంస్థ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: తమ ఏజీఆర్‌ బకాయిల్లో రూ.10,000 కోట్లను చెల్లించినట్లు సోమవారం భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. సుప్రీం కోర్టు ఆగ్రహం నేపథ్యంలో టెలికం శాఖ చేస్తున్న ఒత్తిడితో బాకీలను చెల్లించే పనిలోపడ్డారు టెలికం ఆపరేటర్లు. భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలకు తక్షణమే బకాయిలను చెల్లించాలంటూ ఈ నెల 14న టెలికం శాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏజీఆర్‌ బకాయిల విషయంలో తామిచ్చిన తీర్పుపై టెలికం శాఖ డెస్క్‌ అధికారి స్టే విధిస్తారా అంటూ గత శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం మండిపడిన నేపథ్యంలో సర్కిళ్లు, జోన్లవారీగా టెలికం శాఖ తాఖీదులతో స్పందించింది. వెంటనే బాకీలు తీర్చకపోతే లైసెన్స్‌ నిబంధనల ప్రకారం తదుపరి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


నిజానికి గత నెల 23కల్లా ఏజీఆర్‌ బకాయిలన్నింటినీ తీర్చాలని టెలికం సంస్థలకు సుప్రీం గడువిచ్చింది. దీంతో ఈ నెల 20లోగా రూ.10,000 కోట్లను, కోర్టిచ్చిన గడువు వచ్చే నెల 17కల్లా మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని టెలికం శాఖకు ఎయిర్‌టెల్‌ తక్షణమే తెలియజేసింది. ఈ క్రమంలోనే భారతీ ఎయిర్‌టెల్‌ (విలీన సంస్థ టెలీనార్‌ ఇండియాసహా) తరఫున రూ. 9,500 కోట్లు, భారతీ హెక్సాకామ్‌ కోసం రూ.500 కోట్లు చెల్లించినట్లు ఓ ప్రకటనలో సంస్థ యాజమాన్యం తాజాగా తెలిపింది. స్వయం మదింపు ప్రకియ అనంతరం మిగ తా బకాయిలను చెల్లిస్తామని స్పష్టం చేసింది. నెల రోజుల్లో ఇదంతా పూర్తి కాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం టెలికం శాఖకు భారతీ ఎయిర్‌టెల్‌ బకాయిలు రూ.35,586 కోట్లుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల బాకీలే. కాగా, ఏజీఆర్‌ బకాయిల కేసును పరిష్కరించుకోవడంలో భాగంగా ప్రభుత్వానికి రూ.2,197 కోట్లు చెల్లిస్తున్నట్లు సోమవారం టాటా గ్రూప్‌ సంస్థ టాటా టెలీసర్వీసెస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఎయిర్‌టెల్‌లో టాటా టెలీసర్వీసెస్‌ను విలీనం చేసిన సంగతి విదితమే.


వొడాఫోన్‌ ఐడియాకు ఎదురుదెబ్బ

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల్లో సుప్రీం కోర్టుకు వొడాఫోన్‌ ఐడియా చేసిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. సోమవారం రూ.2,500 కోట్లు, శుక్రవారంలోగా మరో రూ.1,000 కోట్లను ఇస్తామని సంస్థ చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. అంతేగాక సంస్థపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని వొడా ఐడియా తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహ్తగీ చేసిన విజ్ఞప్తిని కూడా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం కొట్టివేసింది. అయినప్పటికీ తమ ప్రతిపాదన ప్రకారం వెంటనే రూ.2,500 కోట్లు చెల్లిస్తామని, ఈ వారం ఆఖరుకల్లా మరో రూ.1,000 కోట్లను టెలికం శాఖకు అందజేస్తామని సోమవారం రాత్రి ఓ ప్రకటనలో వొడాఫోన్‌ ఐడియా తెలియజేసింది. మిగతా బకాయిలను ఎలా? చెల్లించగలమన్న దాన్ని సంస్థ బోర్డు నిర్ణయిస్తుందని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు వివరించింది. 


సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ప్రకారం టెలికం శాఖకు వొడాఫోన్‌ ఐడియా రూ.53,000 కోట్లకుపైగా బకాయిపడింది. ఇందులో రూ.24,729 కోట్లు స్పెక్ట్రం బకాయిలవగా, మరో రూ.28,309 కోట్లు లైసెన్స్‌ ఫీజు. మొత్తం 15 సంస్థలు టెలికం శాఖకు ఇవ్వాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నా యి. ఇందులో స్పెక్ట్రం వినియోగ చార్జీల బకాయిలు రూ.55,054 కోైట్లెతే, రూ.92,642 కోట్లు లైసెన్స్‌ ఫీజు బాకీలు. టెలికం సంస్థల వార్షిక సవరణ స్థూల ఆదాయం లెక్కింపులో నాన్‌-కోర్‌ బిజినెస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కలుపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో సమర్థించడంతో ఏజీఆర్‌ బకాయిలు ఈ స్థాయిలో పెరిగాయి.


ద్రవ్యలోటును తగ్గిస్తుంది

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు.. జీడీపీలో ద్రవ్యలోటు తగ్గుదలకు దోహదం చేస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ద్రవ్యలోటును 3.8 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఏజీఆర్‌ బకాయిలు వసూలైతే అది 3.5 శాతానికే పరిమితం కాగలదని అంటున్నారు. మరోవైపు సుప్రీం కోర్టు ఇచ్చిన ఏజీఆర్‌ తీర్పు టెలికం రంగేతర ప్రభుత్వ సంస్థలకు వర్తించబోదనే అనుకుంటున్నట్లు చమురు శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జనవరి 23లోగా ఏజీఆర్‌ బకాయిలను తీర్చాలని నిరుడు అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘించారంటూ ఈ నెల 14న అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతీ విదితమే. 


ఈ క్రమంలో టెలికం శాఖ నోటీసులు.. టెలికం సంస్థల బకాయిల చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన్‌ పైవిధంగా స్పందించారు. ఏజీఆర్‌ బకాయిల్లో గెయిల్‌ ఇండియా రూ.1.83 లక్షల కోట్లు, ఆయిల్‌ ఇండియా దాదాపు రూ.48,500 కోట్లు, పవర్‌ గ్రిడ్‌ రూ.21,953.65 కోట్లు, గుజరాత్‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ రూ.15,020 కోట్లున్నాయి. ఈ చెల్లింపులపై ఆయా సంస్థలు న్యాయపోరాటం చేస్తున్నది తెలిసిందే. టెలికం రంగేతర సంస్థల ఏజీఆర్‌ బకాయిలు మొత్తం రూ.2.65 లక్షల కోట్లుగా ఉన్నాయి.


logo