శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 17, 2020 , 00:41:19

సైయెంట్‌ లాభం రూ.108 కోట్లు

సైయెంట్‌ లాభం రూ.108 కోట్లు

హైదరాబాద్‌, జనవరి 16: రాష్ర్టానికి చెందిన ఐటీ సేవల సంస్థ సైయెంట్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.108.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.92.10 కోట్ల లాభంతో పోలిస్తే 17.6 శాతం పెరుగుదల కనిపించింది. లాభాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థకు ఆదాయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.9 శాతం పతనం చెంది రూ.1,106 కోట్లకు పరిమితమైంది. 2018-19 ఏడాది క్యూ3లో రూ.1,187.6 కోట్లుగా ఉన్నది. ఇతర మార్గా ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరగడం వల్లనే లాభాల్లో 10 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ ఎండీ, సీఈవో కృష్ణ బొడనపు తెలిపారు.


డాలర్‌ రూపంలో కంపెనీ నికర లాభం 18.6 శాతం పెరిగి 15.2 మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఆదాయం మాత్రం 6 శాతం తగ్గి 155.2 మిలియన్‌ డాలర్లకు పరిమితమైందన్నారు. ప్రతిసారి మూడో త్రైమాసికంలో వ్యాపార రంగం మందకొడిగా ఉంటుందని, కానీ, గత మూడు నెలల్లో కీలకమైన ఒక అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇందుకు దోహదం చేసిందని, ఈ వృద్ధి భవిష్యత్తులోనూ ఉంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. కానీ, 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశాలున్నాయని, ముఖ్యంగా కమ్యూనికేషన్స్‌, ఏరోస్పెస్‌ విభాగాల్లో కీలక క్లయింట్లను కోల్పోవడం ఇందుకు కారణమన్నారు. డిసెంబర్‌ చివరినాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 14,472కి చేరుకోగా, ఇదే సమయంలో వలసలు 19.7 శాతంగా ఉన్నాయి.


logo