అప్పులేని వారంత ధనవంతులుండరు. అప్పు చేయడమే అలవాటుగా ఉన్నవారు కోకొల్లలు. అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితాలు దుర్భరమైన కుటుంబాలనేకం. సులభంగా దొరికే అప్పు మరీ డేంజర్. అలాంటి కోవలోనిదే.. క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డు ఇచ్చే సౌలభ్యం కారణంగా అనేక మంది దాన్ని విరివిగా వాడుతూ చివరికి ఎన్నటికీ తీరని డెట్ ట్రాప్‌లో పడుతుంటారు. క్రెడిట్ కార్డును ఎలాంటి సందర్భాల్లో వినియోగించరాదో తెలుసుకుందాం. దీంతో కొంతవరకైనా డెట్ ట్రాప్‌లో చిక్కుకోకుండా ఉండవచ్చు.
రివార్డు పాయింట్ల కోసం..
క్రెడిట్ కార్డు వినియోగాన్ని పెంచేందుకు వాటిని జారీచేసే సంస్థలు అనేక స్కీములను ప్రకటిస్తాయి. ఇందులో రివార్డు పాయింట్స్ ఒకటి. ఇంత వినియోగిస్తే ఇన్ని పాయింట్లు అంటూ ప్రకటిస్తాయి. సాధారణంగా వంద నుంచి రెండు వందల రూపాయల వ్యయానికి ఒక రివార్డు పాయింట్‌ను ఇస్తాయి. కొంతకాలం తర్వాత ఈ పాయింట్లను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇలా వచ్చిన పాయింట్లు ఉచితంగా రావడం లేదన్న విషయాన్ని మరిచి భారీగా, తాహతుకు మించి ఖర్చు చేస్తుంటారు. కానీ తీసుకున్న క్రెడిట్‌ను పూర్తిగా చెల్లించకుండా రోలింగ్ చేస్తే, దాని మీద చెల్లించాల్సి వచ్చే వడ్డీతో పోల్చితే రివార్డు పాయింట్ల ప్రయోజనం చాలా తక్కువ.
విలాసాలకు..
అవసరం లేనివి కొనడం అలవాటు చేసుకుంటే అవసరం ఉన్నవాటిని అమ్ముకోవాల్సి వస్తుంది అనేది నానుడి. చేతిలో నగదు లేకపోయినా, కొనుగోలు చేసే వెసులుబాటు క్రెడిట్ కార్డు ఇస్తుంది. అయితే ఇదే అనవసరపు కొనుగోళ్లను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి వ్యయాలను ఏ నెలకానెల తీర్చివేస్తే ఫర్వాలేదు. కానీ, ఇలాంటి కొనుగోళ్లన్నీ అధిక మొత్తంలో ఉంటాయి. విలాసాల కోసం ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ అనిపించుకోదు. క్రెడిట్ కార్డుపై ఉండే రోలింగ్ క్రెడిట్ వల్ల సిబిల్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
రోలింగ్ క్రెడిట్
క్రెడిట్ కార్డు మీద చేసిన ఖర్చులను పూర్తిగా చెల్లించకుండా, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించి మిగిలిన దాన్ని వాయిదా వేయడమే రోలింగ్ క్రెడిట్. ఇలాంటి క్రెడిట్ మీద ఏటా 40 శాతం వడ్డీ, దాని మీద జీఎస్టీ కలిపితే నెలకు చెల్లించే వడ్డీతో దాదాపు 45 శాతానికిపైగా అదనపు భారం పడుతుంది. రోలింగ్ క్రెడిట్ మరో రకంగా రుణాల ఊబిలోకి దించే ఎర మాత్రమే అనే విషయాన్ని గమనించండి.
నగదు కోసం..
ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేస్తే ఆ రోజు నుంచే వడ్డీ పడుతుందనే విషయాన్ని గమనించండి. ఆ పని చేస్తున్నారంటేనే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నారన్నది తేటతెల్లం. ఇలా తీసుకున్న నగదు మీద నెలకు నాలుగు రూపాయల వరకు వడ్డీ పడుతుంది. దీనికితోడు ట్రాన్జాక్షన్ ఛార్జీలు, వడ్డీ మీద జీఎస్టీలు అదనం. ఇది మిమ్ములను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రయత్నమే.