ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 25, 2021 , 01:24:37

నకిలీలతో జాగ్రత్త!

నకిలీలతో జాగ్రత్త!

ఫేక్‌ మెసేజీలను ఎలా గుర్తించాలంటే?

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఖాతాదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇలాంటి మోసాలను చాలా వరకు నిరోధించవచ్చు. దీనిపై ఖాతాదారుల్లో అవగాహన పెంచేందుకు దాదాపు అన్ని బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంకు ముందు వరుసలో ఉన్నది. ఖాతాదారులు తమ మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను జాగ్రత్తగా చదవాలని, ఆ సందేశాల పైన పేర్కొనే ఇండికేటర్లను గమనించాలని ఆ బ్యాంకు సూచిస్తున్నది. కేటుగాళ్ల నుంచి ప్రధానంగా వచ్చే మూడు రకాల మోసపూరిత సందేశాలను, వాటి వలలో చిక్కుకోకుండా చూసుకునేందుకు ఖాతాదారులు చేపట్టాల్సిన జాగ్రత్తలను ఐసీఐసీఐ బ్యాంకు ఎప్పటికప్పుడు ఈ-మెయిళ్ల ద్వారా వివరిస్తున్నది.

మోసపూరిత సందేశాలు

  • BP-Bean YTM అనే సెండర్‌ నుంచి ఫేక్‌ మెసేజ్‌ 1: ‘మీ కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) విజయవంతంగా అప్‌డేట్‌ అయింది. ఇప్పుడు మీరు రూ.1,300 క్యాష్‌బ్యాక్‌ పొందేందుకు అర్హులు. దీన్ని క్లెయిమ్‌ చేసుకోవాలంటే.. http://311agtrను సందర్శించండి’
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ మాట: కేవైసీకి ఎలాంటి రివార్డులు రావు. ఇది నిస్సందేహంగా మోసపూరిత సందేశమే. దీనిలోని లింక్‌ కూడా నకిలీదే.
  • Y-Cash అనే సెండర్‌ నుంచి ఫేక్‌ మెసేజ్‌ 2: ‘మీకు శుభాకాంక్షలు. మీ ఖాతాలో రూ.3.30 లక్షలు జమ అయ్యాయి. దీన్ని ప్రాసెస్‌ చేసేందుకు http:// i2urewards.cc/33లో మీ వివరాలను పొందుపర్చండి’
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ మాట: ఏ కంపెనీ అయినా ఉచితంగా ఇంత పెద్ద మొత్తంలో నగదును ఆఫర్‌ చేయదు. ఈ మెసేజ్‌లో పొందుపర్చిన లింక్‌ నకిలీదే.
  • [email protected] అనే సెండర్‌ నుంచి ఫేక్‌ మెసేజ్‌ 3: ‘మీ ఆదాయ పన్ను రిఫండ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. దీన్ని క్లెయిమ్‌ చేసుకునేందుకు నేడే తుది గడువు. http://itr.trn./toref వెబ్‌సైట్‌ను సందర్శించండి’
  • ఐసీఐసీఐ బ్యాంక్‌ మాట: ప్రశ్నించదగినట్లుగా ఉన్న సెండర్‌ ఐడీని గమనించండి. తుది గడువు పేరుతో మిమ్మల్ని ఎందుకు తొందరపెడుతున్నారో పరిశీలించండి.

VIDEOS

logo