గురువారం 04 జూన్ 2020
Business - May 11, 2020 , 00:30:10

ఆర్థిక గణాంకాలపై ఆధారం

ఆర్థిక గణాంకాలపై ఆధారం

  • కార్పొరేట్‌ ఫలితాలు, కరోనా కేసులు కీలకం
  • ఈ వారం మార్కెట్‌ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, మే 10: ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్‌ త్రైమాసిక ఫలితాలు, కరోనా కేసులు ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలవుతుండటంతో మదుపరులు వాటి ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయానికి రావచ్చన్నారు. అలాగే జనవరి-మార్చికిగాను ఆయా సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలూ ప్రధానమేనని అంటున్నారు. ఈ వారం మారుతీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి ప్రముఖ సంస్థల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదయ్యే కరోనా కేసులూ కీలకమేనని చెప్తున్నారు. 

14న రిలయన్స్‌ రైట్స్‌ ఇష్యూ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రైట్స్‌ ఇష్యూ రికార్డు తేదీలను ప్రకటించింది. ఈ నెల 14గా నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్ద రైట్స్‌ ఇష్యూతో వస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ గత నెల 30న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీని విలువ రూ.53,125 కోట్లు. 1:15 నిష్పత్తిలో ఈ రైట్స్‌ ఇష్యూను ప్రతిపాదించారు. ప్రస్తుతం సంస్థలో వాటాలున్నవారికి తమ ప్రతీ 15 షేర్లకు ఒక షేర్‌ చొప్పున కొనుగోలు చేసే అవకాశం దక్కనున్నది.

నేటి నుంచి గోల్డ్‌ బాండ్ల విక్రయం

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెండో విడుత గోల్డ్‌ బాండ్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్‌ కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఆదరణ లభించగలదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 15తో సబ్‌స్క్రిప్షన్‌ ముగియనున్నది. గ్రాము ధర రూ.4,590గా నిర్ణయించారు. డిజిటల్‌ వేదికల ద్వారా కొన్నవారికి రూ.50 రాయితీ లభిస్తుంది. కేంద్రం తరఫున ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది.


logo