మంగళవారం 09 మార్చి 2021
Business - Feb 07, 2021 , 01:50:12

వంద మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాల రైటాఫ్‌

వంద మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాల రైటాఫ్‌

  • వంద మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాల రైటాఫ్‌
  • ఆర్టీఐ కార్యకర్తకు వెల్లడించిన రిజర్వు బ్యాంకు
  • రూ.62,000  కోట్లు
కోల్‌కతా, ఫిబ్రవరి 6: వేల కోట్ల రూపాయల రుణాలను ఎంతకీ వసూలు కావట్లేదని బ్యాంకులు రైటాఫ్‌ చేస్తున్నాయి. గతేడాది మార్చి 31 నాటికి టాప్‌-100 ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన దాదాపు రూ.61,949 కోట్ల రుణాలను బ్యాంకులు ఖాతా పుస్తకాల్లో నుంచి తొలగించాయి. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త బిశ్వంత్‌ గోస్వామికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది. రైటాఫ్‌ రుణాల్లో వజ్రాల వ్యాపారి జతిన్‌ మెహెతానే టాప్‌. ఈ జాబితాలో లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా, మీడియా సంస్థ దక్కన్‌ క్రానికల్‌లకు చెందిన రుణాలూ ఉన్నాయి. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం సూత్రధారుల్లో ఒకరైన గీతాంజలి జెమ్స్‌ అధినేత మెహుల్‌ చోక్సీ మొండి బకాయి రూ.5,071 కోట్లుగా ఉందని, ఇందులో రూ.622 కోట్లు రైటాఫ్‌ అయ్యిందని ఆర్బీఐ వివరాల్లో స్పష్టమవుతున్నది.

బయటకురాని విదేశీయుల వివరాలు

2015లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం విదేశీ రుణ గ్రహీతల సమాచారం ఇవ్వలేమని ఈ సందర్భంగా ఆర్బీఐ తేల్చిచెప్పింది. ఇదిలావుంటే రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేస్తున్నప్పటికీ వాటి వసూలు అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంటాయని చెప్పింది. ఖాతా పుస్తకాల్లో మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్‌పీఏ)ల భారాన్ని తగ్గించడానికే బ్యాంకులు రైటాఫ్‌ చేస్తాయని వివరిస్తున్నది. కాగా, 2019 మార్చి 31 నాటికి కూడా టాప్‌-100 ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ.58,375 కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. వీరు ఎగవేసిన మొత్తం రుణాల విలువ రూ.84,000 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2.38 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. దీనివల్ల ఎన్‌పీఏలు 9.1 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గాయి.


VIDEOS

logo