సోమవారం 30 మార్చి 2020
Business - Mar 04, 2020 , 00:06:36

బాబోయ్‌..1.43 లక్షల కోట్లు

బాబోయ్‌..1.43 లక్షల కోట్లు

దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి. బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్‌-డిసెంబర్‌ వ్యవధిలో రూ.1.43 లక్షల కోట్లకుపైగా మోసాలు జరిగాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. బ్యాంకింగ్‌ మోసాలు, మోసగాళ్లపై తీసుకున్న చర్యల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఆర్థిక మోసాలపై 2015 నుంచే ప్రభావవంతమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు.

  • గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు

న్యూఢిల్లీ, మార్చి 3:ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దపెద్ద మోసాల ప్రకటన, దర్యాప్తులకు సంబంధించి సరైన సమయంలోనే స్పందించామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.50 కోట్లకు మించిన బ్యాంక్‌ మోసాలపై ప్రత్యేక శ్రద్ధ వహించామని చెప్పుకొచ్చారు. కాగా, షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు ప్రకటించిన రూ. లక్ష అంతకుమించిన మోసాలు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.10,171 కోట్లుగా ఉంటే ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో రూ.1,43,068 కోట్లుగా ఉన్నాయని నిర్మల వెల్లడించారు. మోసాల్లో బ్యాంక్‌ అధికారుల పాత్రను తగ్గించడానికి బదిలీలు, ఇతరత్రా కఠిన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక 2016-17 నుంచి 2019-20 జనవరి 31 దాకా సీబీఐ న మోదు చేసిన కేసు లు 626 అని, 2,111 మందిపై చార్జిషీట్‌ను నమోదు చేశామన్నారు.


ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.52 లక్షల కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-జనవరి వరకు వసూలైన ప్రత్యక్ష పన్నులు రూ.7.52 లక్షల కోట్లకుపైగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ నెలాఖరుతో ముగిసే ఏడాదిలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.11.70 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో నిరుడు ఏప్రిల్‌ 1 నుంచి జనవరి 31 వరకు జరిగిన వసూళ్ల విలువ రూ.7,52,472 కోట్లుగా ఉందని నిర్మల ప్రకటించారు. లక్ష్య సాధనకు ఈ 2 నెలల్లో ఇంకా రూ.4 లక్షల కోట్లకుపైగానే ఆదాయం కావాల్సి ఉన్నది.


రూ.7,896 కోట్ల జీఎస్టీ మోసం

భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. షెల్‌ కంపెనీలతో వందలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అక్రమార్కుల గుట్టు రైట్టెంది. ఢిల్లీ పశ్చిమ కమిషనరేట్‌కు చెందిన కేంద్ర పన్నుల విభాగంలోని ఎగవేతల నిరోధక అధికారులు ఈ కుంభకోణాన్ని కనిపెట్టారు. 23 డొల్ల సంస్థలను సృష్టించిన మోసగాళ్లు.. వాటి సాయంతో రూ.7,896 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లను పుట్టించారు. ఇందులో మోసపూరితంగా పొందిన రూ.1,709 కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కూడా ఉన్నదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎటువంటి ఉత్పత్తుల సరఫరా లేకుండానే ఇన్వాయిస్‌లను సృష్టించారని, ఐటీసీని పొందారని వెల్లడించింది. ఇదిలావుంటే ఈ కేసులో గత నెల 29న ఇద్దరు అరెస్టవగా, వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఐటీసీ నిజమైనదిగా కనిపించేందుకు బ్యాంకింగ్‌ లావాదేవీలనూ మోసగాళ్లు వినియోగించుకున్నట్లు జీఎస్టీ అధికారులు తెలిపారు.


ఆర్బీఐకి మరిన్ని అధికారాలు

సహకార బ్యాంకుల నియంత్రణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కు మరిన్ని అధికారాలను కల్పిస్తూ లోక్‌సభలో ఓ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లు-2020ని మంత్రి తీసుకొచ్చారు. సహకార బ్యాంకుల్లో మరింత పారదర్శకత, సుపరిపాలనలను ఆర్బీఐ ద్వారా పెంపొందించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ఆమె ఈ సందర్భంగా వివరించారు. సహకార బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. 


logo