ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 13, 2020 , 03:05:09

చౌకగా గృహ రుణం

చౌకగా గృహ రుణం

కొత్తగా ఇల్లు కట్టాలని చూస్తున్నారా? లేదంటే ఫ్లాట్‌ కొనాలని భావిస్తున్నారా? అందుకు మీవద్ద తగినంత డబ్బు ఉంటే సరే. లేదంటే బ్యాంకు నుంచి రుణాన్ని పొందేందుకు ఇదే సరైన తరుణం. కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తున్నది. దీంతో గృహ రుణాలపై వాణిజ్య బ్యాంకులు వసూలుచేసే వడ్డీరేట్లు కూడా మెల్లగా దిగివస్తున్నాయి. 

ప్రభుత్వ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుతం 7 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నది. ఎస్బీఐతో పోలిస్తే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఇంకా తక్కువ వడ్డీ (6.85 శాతం)కే గృహ రుణాలను అందజేస్తున్నది. జూన్‌ రెండో వారంలో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ (రెపో) ఆధారిత వడ్డీరేటును 7.05 శాతం నుంచి 6.65 శాతానికి కుదించిన ఎస్బీఐ.. మరోవైపు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను కూడా 7.25 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది. ఇటీవల రిజర్వు బ్యాంకు రెపోరేటును 4 శాతానికి, రివర్స్‌ రెపోరేటును 3.35 శాతానికి కుదించడంతో గృహ రుణాలపై వాణిజ్య బ్యాంకుల ఫ్లోటింగ్‌ వడ్డీరేట్లు 7 శాతం దిగువకు తగ్గాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ.

అర్హత, ఈఎంఐలు

వడ్డీరేట్ల తగ్గుదలతో రుణగ్రహీతలు చెల్లించే నెలవారీ కిస్తీలు (ఈఎంఐలు) తగ్గుతాయి. 20 ఏండ్ల కాలపరిమితితో ఓ వ్యక్తి 6.95 శాతం వడ్డీరేటుపై ఎస్బీఐ నుంచి రూ.25 లక్షల గృహ రుణం తీసుకొన్నాడనుకొంటే.. అతను చెల్లించే ఈఎంఐ రూ.19,308గా ఉంటుంది. అదే రుణాన్ని ప్రైవేట్‌ బ్యాంక్‌ నుంచి తీసుకొంటే రూ.20,064 ఈఎంఐ చెల్లించాలి. అంటే అతను ప్రైవేట్‌ బ్యాంక్‌కు రూ.1.81 లక్షల అధిక వడ్డీ సమర్పించుకోవాలి. ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్‌ బ్యాంకులు వసూలుచేసే వడ్డీ 50 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు వడ్డీరేట్ల తగ్గుదలతో రుణగ్రహీతలకు లభించే అప్పు కూడా పెరుగుతుంది. నెలకు రూ.45 వేలు సంపాదించే వ్యక్తి 7.45 శాతం వడ్డీరేటుతో రూ.25.23 లక్షల రుణం తీసుకొనేందుకు వీలుంటుంది. ఒకవేళ వడ్డీరేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గితే అతనికి లభించే రుణం దాదాపు లక్ష రూపాయలు పెరుగుతుంది. అయితే ఈ అర్హతా ప్రమాణాలు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు.

మహిళా ఉద్యోగులకు మంచి ఆఫర్‌

ఎస్బీఐ గృహ రుణాల వడ్డీరేటు 6.95 శాతం నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ రుణగ్రహీతల క్రెడిట్‌ ప్రొఫైల్‌, వారు తీసుకొనే రుణ మొత్తాలను బట్టి వాస్తవ వడ్డీరేటు మారుతుంది. రూ.30 లక్షల్లోపు గృహ రుణాలు తీసుకొనే వేతనజీవులకు ఈ వడ్డీరేటు 7 శాతంగా, రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల్లోపు రుణాలకు 7.25 శాతంగా, రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాలకు 7.35 శాతంగా ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్‌ బాగున్న మహిళా ఉద్యోగులు మాత్రం 6.95 శాతం వడ్డీరేటుతోనే ఎస్బీఐ నుంచి రుణాలు పొందవచ్చు. ప్రస్తుతం గృహ రుణాల విభాగంలో బ్యాంకుల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతున్నది. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు దాదాపు ఒకే విధమైన వడ్డీరేటుతో గృహ రుణాలిచ్చేవి. కానీ దేశంలో లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు తగ్గడంతో అవి పోటీలో వెనుకబడ్డాయి. ప్రస్తుతం ఉద్యోగులకు 7.45 శాతం వడ్డీతో రూ.35 లక్షల వరకు గృహ రుణాలను అందజేస్తున్న ఐసీఐసీఐ బ్యాంకు.. రూ.75 లక్షలకు మించిన గృహ రుణాలపై 8.45 శాతం వడ్డీ విధిస్తున్నది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ గృహ రుణ వడ్డీరేట్లు 7.35 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

తక్కువ వడ్డీకి రుణాలిస్తున్న బ్యాంకులు

 • యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.7%
 • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.85%
 • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6.85%
 • సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6.85%
 • పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ 6.9%
 • కెనరా బ్యాంక్‌ 6.9%
 • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7%
 • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 7%
 • ఇండియన్‌ బ్యాంక్‌ 7%
 • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 7.3%
 • హెచ్‌డీఎఫ్‌సీ 7.35%
 • కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 7.35%
 • నైనిటాల్‌ బ్యాంక్‌ 7.4%
 • ఐసీఐసీఐ 7.45%
 • ఐడీబీఐ బ్యాంక్‌ 7.8%


logo