గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 18, 2021 , 00:58:41

గృహ రుణాలపై బ్యాంకుల బంపర్‌ ఆఫర్లు

గృహ రుణాలపై బ్యాంకుల బంపర్‌ ఆఫర్లు

దేనికైనా టైమ్‌ రావాలంటారు పెద్దలు. సొంతిల్లు విషయంలో ఇప్పుడు మంచి టైమ్‌ మొదలైంది. సామాన్యుడైనా.. సంపన్నుడైనా.. స్థాయికి తగ్గట్టుగా ఓ ఇల్లు సమకూర్చుకొని హాయిగా బతుకాలని అనుకుంటారు. ఈ కలను నెరవేర్చుకునేందుకు సామాన్యులకు ఉన్న ప్రధాన మార్గం బ్యాంక్‌ రుణం. ఒకప్పుడు గృహరుణాలపై వడ్డీ మోయలేని భారంగా ఉండేది. రిజర్వ్‌బ్యాంక్‌ పుణ్యమా అని 10% దిగువకు పడిపోయింది. తాజాగా మరింత తగ్గింది. హోమ్‌లోన్‌ కస్టమర్లకు వడ్డీలో 30 బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. అంతేకాకుండా ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా తొలగించింది. ఈ ఆఫర్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మున్ముందు వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. 

హోమ్‌ లోన్‌తో ప్రయోజనాలెన్నో

గృహరుణాలు తీసుకుంటే పన్నులు కలిసివస్తాయి. వీటి ఈఎంఐ (నెలవారీ కిస్తీ)లు ఆదాయ పన్ను చటం పరిధిలోకి వస్తాయి. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80ఈఈ, సెక్షన్‌ 24 కింద రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద గృహ రుణాలకు దరఖాస్తు చేసుకుంటే కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశముంటుంది. 

అన్ని కోణాల్లో పరిశీలించాకే

బ్యాంకులు హోమ్‌ లోన్‌ ఇచ్చేముందు దరఖాస్తుదారుడి వయసు, ఆర్థిక పరిస్థితి, నెలవారీ ఆదాయం. వృత్తి, సంస్థ, గత రుణ చరిత్ర లాంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. సిబిల్‌ స్కోరు కనీసం 750 ఉండాలి. దాదాపు అన్ని బ్యాంకులు 30 ఏండ్ల వరకు కాల పరిమితితో రుణాలిస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు నెలకు కనీసం రూ.10 వేల ఆదాయం ఉంటే లోన్లు ఇస్తాయి. అదే ప్రైవేట్‌ బ్యాంకులైతే మన నెలవారీ ఆదాయం రూ.15 వేల నుంచి రూ.25 వేల మధ్యలో ఉండాలి.

మహిళలుంటే మరిన్ని ప్రయోజనాలు

హోమ్‌ లోన్‌ విషయంలో మహిళా భాగస్వామి ఉంటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. మహిళలకు కొన్ని బ్యాంకులు వడ్డీలో ప్రత్యేకంగా 0.25 నుంచి 0.5 శాతం వరకు రాయితీ ఇస్తున్నాయి. దంపతులిద్దరూ కలిస్తే వారి ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో రుణ పరిమాణం పెరుగుతుంది. జీతంలో ఇద్దరికీ పన్ను రాయితీలు వస్తాయి. రుణాన్ని బట్టి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీని 1-2 శాతం వరకు తగ్గిస్తున్నది. 

ఏ పత్రాలు కావాలంటే..

బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకోవాలంటే దరఖాస్తుతోపాటు మూడేండ్ల ఐటీ రిటర్నులు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, గుర్తింపు కార్డు (ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌,  ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్సులో ఏదో ఒకటి), వయసు, నివాస ధ్రువీకరణలు, ఆదాయ ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు రూ.30 లక్షల రుణాన్ని 30 ఏండ్ల కాల వ్యవధితో 7 శాతం ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటుకు తీసుకుంటే నెలకు రూ.19,959 ఈఎంఐ చొప్పున మొత్తం రూ.71.85 లక్షలు చెల్లించాలి. అదే ఫ్లోటింగ్‌ వడ్డీతో తీసుకుంటే.. ఆరు నెలల తర్వాత 0.2 శాతం తగ్గినా ఈఎంఐ 19,558కి తగ్గుతుంది. తద్వారా రూ.1.42 లక్షలు ఆదా అవుతుంది. అంటే 8 నెలల ఈఎంఐ కలిసివస్తుంది. 

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటే బెటర్‌

హోమ్‌ లోన్స్‌కు బ్యాంకులు రెండు రకాల వడ్డీ రేట్లను అమలు చేస్తున్నాయి. ఫిక్స్‌డ్‌ రేట్‌లో మొదటి నెల నుంచి చివరి వరకు స్థిరంగా ఒకే వడ్డీ రేటు ఉంటుంది. కాబట్టి ప్రతి నెల ఎంత కట్టాలో కచ్చితమైన అంచనాతో ఉండొచ్చు. అంతేకాకుండా మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే డబ్బు ఆదా అవుతుంది. కావాలనుకంటే నిర్దేశిత కాలం తర్వాత ఫ్లోటింగ్‌ రేటుకు మారవచ్చు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు.. బ్యాంకుల రుణ విధానాలు, నిర్ణయాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి ఈఎంఐ కూడా మారుతూ ఉంటుంది. వడ్డీ తగ్గితే డబ్బు ఆదా అవుతుంది. ఒకవేళ రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది. ప్రస్తుతం ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు 6.70 నుంచి 8.2 శాతం మధ్య.. ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు 7.40 నుంచి 12 శాతం మధ్య ఉన్నది. 

పంచ సూత్రాలు

గృహ రుణాలను తీసుకునేవారు ప్రధానంగా వడ్డీ రేటు, ఫీజులు, రుణ కాల పరిమితి, డౌన్‌ పేమెంట్‌, లోన్‌ ట్రాన్స్‌ఫర్‌ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు ఏ బ్యాంకులో తక్కువో గమనించాలి. చర (ఫ్లోటింగ్‌) వడ్డీని ఎంచుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి వడ్డీరేటు మారుతుందో.. వడ్డీ రేటు తగ్గితే ప్రయోజనాన్ని ఎలా అందిస్తారో తెలుసుకోవాలి. సాధారణంగా బ్యాంకులు 5 నుంచి 30 ఏండ్ల కాల పరిమితితో గృహ రుణాలిస్తాయి. కానీ మరీ ఎక్కువ కాల పరిమితితో ఈఎంఐలు పెట్టుకుంటే వడ్డీ తడిసి మోపెడవుతుంది. ఇల్లు కొనేటప్పుడు కొంత డౌన్‌ పేమెంట్‌ చెల్లించాలి. ఇది మొత్తం రుణంలో 20-30 శాతం వరకు ఉంటుంది.

VIDEOS

logo