శనివారం 16 జనవరి 2021
Business - Aug 19, 2020 , 00:02:06

మార్కెట్లో బ్యాంకోత్సాహం

మార్కెట్లో బ్యాంకోత్సాహం

ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లతోపాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) షేర్‌ కొనుగోళ్లకు మదుపరులు అమితాసక్తిని చూపడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ఆరంభం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ పెరుగుతూ పోయాయి. చివరకు ఆకర్షణీయ స్థాయిలో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 477.54 పాయింట్లు లేదా 1.26 శాతం ఎగబాకి 38,528.32 వద్ద స్థిరపడింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 138.25 పాయింట్లు లేదా 1.23 శాతం ఎగిసి 11,385.35 వద్ద నిలిచింది. గడిచిన ఐదు నెలలకుపైగా కాలంలో సూచీలకు ఇదే అత్యధిక ముగింపు స్థాయి కావడం గమనార్హం. సోమవారం కూడా మార్కెట్లు లాభాలను అందుకున్న విషయం తెలిసిందే.  

రూ.2.71 లక్షల కోట్లు పైకి

స్టాక్‌ మార్కెట్లలో వరుస లాభాలతో మదుపరుల సంపద రెండు రోజుల్లో రూ.2.71 లక్షల కోట్లు పెరిగింది. సోమ, మంగళవారాల్లో సెన్సెక్స్‌ 651 పాయింట్లకుపైగా ఎగిసింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలూ 1.30 శాతం పుంజుకున్నాయి. దీంతో బీఎస్‌ఈ సంస్థల షేర్ల విలువ రూ.2,71,541.13 కోట్లు ఎగబాకి రూ.1,54,11,199.53 కోట్లకు చేరింది.