శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 02, 2020 , 00:42:11

తర్వాత బాదుడే

తర్వాత బాదుడే

  • మారటోరియం భారమేనంటున్న బ్యాంకులు 
  • వాయిదా కాలానికి వడ్డీ పడుతుందన్న ఎస్బీఐ
  • అదనపు ఈఎంఐల ద్వారా వసూలు 
  • చెల్లింపులే శ్రేయస్కరం:హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
  • ఈ 3 నెలల విరామం కావాలనుకుంటే చెప్పాల్సిందే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: ఆర్బీఐ మారటోరియంతో ఒరిగిదేమీ ఉండదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మూడు నెలలు ఈఎంఐలు చెల్లించకపోతే ఆ తర్వాత వడ్డీతోసహా కట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సం.. దాని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రుణాల నెలసరి చెల్లింపులను వాయిదా వేసుకునే అవకాశాన్ని కస్టమర్లకు, అనుమతిని బ్యాంకర్లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 27న ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం అన్ని టర్మ్‌ లోన్లపై మారటోరియం తీసుకునే అవకాశం రుణగ్రహీతలకు ఉంటుంది. మార్చి 1 నుంచి మే 31 వరకు ఉన్న కాలానికి సంబంధించిన ఈఎంఐలను వాయిదా వేసుకోవచ్చు. 

అంటే ఏప్రిల్‌, మే, జూన్‌ ఈఎంఐ చెల్లింపులకు దూరంగా ఉండొచ్చు. అయితే ఈఎంఐలను వాయిదా వేసుకోవడం వల్ల రుణగ్రహీతలకు లాభమేమీ ఉండదని బ్యాంకర్లు అంటున్నారు. మారటోరియం వ్యవధి ముగిసిన తర్వాత ఈ మూడు నెలల విరామ కాలానికి వడ్డీ లెక్కించి వేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ స్పష్టం చేసింది. మారటోరియం తీసుకున్న కస్టమర్ల నుంచి ఈ వడ్డీని అదనపు ఈఎంఐల ద్వారా వసూలు చేస్తామని వెల్లడించింది. ఉదాహరణకు 8.3 శాతం వడ్డీరేటుతో రూ.30 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తి 15 సంవత్సరాలు దాని ఈఎంఐలు చెల్లించాలనుకుందాం. వీరు ఈ మూడు నెలల మారటోరియం తీసుకుంటే మొత్తం రుణ కాలపరిమితిలో అదనంగా నికర వడ్డీ దాదాపు 2.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 

ఇది వీరిప్పుడు చెల్లిస్తున్న 8 నెలల ఈఎంఐలకు సమానమని ఎస్బీఐ తెలిపింది. అలాగే రూ.6 లక్షల వాహన రుణం 54 నెలల కాలవ్యవధితో తీసుకున్నవారు మారటోరియంను తీసుకుంటే రూ.19వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇది వీరు సాధారణంగా చెల్లించే ఈఎంఐలకు ఒకటిన్నర రెట్లు అధికం. కాబట్టి నగదు కొరత లేనివారు మారటోరియానికి దూరంగా ఉండటమే ఉత్తమమని బ్యాంకులు చెప్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఇదే సూచిస్తున్నది. అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలపరిమితి పొడిగింపు నుంచి తప్పించుకోవాలని హితవు పలికింది. కాగా, కరోనా కారణంగా తమ ఆదాయం దెబ్బతిన్నవారే మారటోరియంను తీసుకోవాలని భారతీయ బ్యాంకింగ్‌ సంఘం రుణగ్రహీతలకు సూచించింది. దాదాపు వేతన జీవుల కంటే వ్యాపారులకు మారటోరియం ఇప్పుడు లాభదాయకమని అభిప్రాయపడింది.

బీవోబీ ఈఎంఐ రిఫండ్‌

మార్చి నెలకుగాను ఇప్పటికే రుణాల ఈఎంఐ ఖాతాల నుంచి కైట్టెతే.. వారికి తిరిగి ఆ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) బుధవారం తమ కస్టమర్లకు తెలిపింది. ఈ అవకాశం గృహ, ఆటో రుణ గ్రహీతలకు మాత్రమేనన్న బ్యాంక్‌.. ఆర్బీఐ మూడు నెలల మారటోరియం కింద ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఆదాయం దెబ్బతిన్నవారికి తమ ఈ నిర్ణయం ఊరటనివ్వగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా బీవోబీ వ్యక్తం చేసింది. కోరుకున్నవారికే ఈ సదుపాయం ఉంటుందని తెలిపింది.

ముందుగా సమాచారం ఇవ్వాలి

మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు తమతమ బ్రాంచీలకు సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌజ్‌ (ఎన్‌ఏసీహెచ్‌) ద్వారా ఈఎంఐలను చెల్లిస్తున్నవారు ఎన్‌ఏసీహెచ్‌ నిలుపుదలకు, పొడిగింపు కోసం ఈ-మెయిల్‌ ద్వారా సూచించిన బ్యాంక్‌ ఈ-మెయిల్‌ ఐడీకి సందేశం ఇవ్వాలని ఎస్బీఐ తమ కస్టమర్లను కోరింది. ఎస్బీఐ వెబ్‌సైట్‌లో అన్ని సర్కిళ్లకు సంబంధించిన ఈ-మెయిల్‌ ఐడీలు ఉంటాయని చెప్పింది. అలాగే మారటోరియం వద్దనుకుని యథాతథంగా ఈఎంఐలు చెల్లించాలనుకునేవారికి దీంతో పనిలేని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా తమ వెబ్‌సైట్‌ హోం పేజీల్లో కస్టమర్ల కోసం మారటోరియం ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. ఈఎంఐల వాయిదా కోరుకునేవారు తమతమ లోన్‌ అకౌంట్‌ నెంబర్లను, ఇతరత్రా సులభతరమైన వివరాలను పొందుపరుచాలని సూచించాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సైతం మారటోరియం కావాలనుకుంటే ఈ-మెయిల్‌ సందేశాలను కస్టమర్ల నుంచి కోరింది. యాక్సిస్‌ బ్యాంక్‌ మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఓ నిర్ణయాన్ని కస్టమర్లకు అందిస్తామని తెలిపింది.


logo