శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 09, 2021 , 17:52:58

ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మార్చి 15,16ల్లో బ్యాంకుల స‌మ్మె

ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మార్చి 15,16ల్లో బ్యాంకుల స‌మ్మె

న్యూఢిల్లీ: రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు స‌మ్మె బాట ప‌ట్టాయి. వ‌చ్చేనెల 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు స‌మ్మె చేయాల‌ని తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల స‌మాఖ్య‌.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణ‌యించింది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) వార్షిక బ‌డ్జెట్‌ను ఈ నెల ఒక‌టో తేదీన పార్ల‌మెంట్‌కు స‌మ‌ర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు. 

ఇప్ప‌టికే 2019లో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం విక్ర‌యించింది. గ‌త నాలుగేండ్ల‌లో 14 బ్యాంకుల‌ను ఇత‌ర బ్యాంకుల్లో విలీనం చేసింది. ఈ నేప‌థ్యంలో యూఎఫ్‌బీయూ కార్య‌వ‌ర్గ భేటీ మంగ‌ళ‌వారం స‌మావేశ‌మై చ‌ర్చించింద‌ని అఖిల‌భార‌త బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ వెంక‌టాచ‌లం తెలిపారు. బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాల‌ని యూఎఫ్బీయూ తీర్మానించింద‌న్నారు. 

‘ఐడీబీఐ బ్యాంకు త‌ర‌హాలో రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీకరించ‌డంతోపాటు బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ఎల్ఐసీలో వాటాల ఉప‌సంహ‌ర‌ణ‌, ఒక సాధార‌ణ బీమా సంస్థ ప్రైవేటీక‌ర‌ణ‌, బీమా రంగంలో నేరుగా 74 శాతం ఎఫ్‌డీఐల‌కు అనుమ‌తి, దూకుడుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ త‌దిత‌ర కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స‌మావేశంలో చ‌ర్చించాం’ అని వెంక‌టాచ‌లం తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌లు స‌ర్కార్ తిరోగ‌మ‌న వైఖ‌రిని తెలియ‌జేస్తున్నాయ‌న్నారు. చ‌ర్చ‌ల త‌ర్వాత మార్చి 15, 16 తేదీల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా రెండు రోజులు స‌మ్మె చేయాల‌ని తీర్మానించిన‌ట్లు ఏఐబీవోసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సౌమ్య ద‌త్తా ప్ర‌క‌టించారు.

యూఎఫ్‌బీయూలో అఖిల భార‌త ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), అఖిల భార‌త బ్యాంక్ అధికారుల కాన్ఫిడ‌రేష‌న్‌ (ఏఐబీవోసీ), నేష‌న‌ల్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), అఖిల భార‌త బ్యాంక్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (ఏఐబీవోఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (బెఫీ) స‌భ్యులుగా ఉన్నాయి. ఇంకా ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ (ఐఎన్‌బీఈఎఫ్‌), ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీవోసీ), నేష‌న‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ వ‌ర్క‌ర్స్ (ఎన్వోబీడ‌బ్ల్యూ), నేష‌న‌ల్ ఆర్గ‌నైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ (ఎన్వోబీవో) కూడా స‌భ్య సంఘాలుగా ఉన్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo