ముంబై, మార్చి 15: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. రెపోతో అనుసంధనం చేసుకున్న రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. తగ్గించిన వడ్డీరేటు సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రెపో-లింక్డ్ రుణాలపై వడ్డీరేటు 6.85 శాతం నుంచి 6.75 శాతానికి దిగిరానున్నది. అలాగే బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటు(బీఆర్ఎల్ఎల్ఆర్) తగ్గింపుతో గృహ రుణాలపై వడ్డీరేటు 6.75 శాతానికి తగ్గనుండగా, అలాగే వాహన రుణాలు 7 శాతంతో ప్రారంభంకానున్నాయి. మార్ట్గేజ్ రుణాలపై రేటు 7.95 శాతం ప్రారంభంకానుండగా, విద్యా రుణాలపై వడ్డీరేటు 6.75 శాతంగా నిర్ణయించింది. ఖాతాదారులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎల్ఎల్ఆర్ని తగ్గించినట్లు, అలాగే డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా కస్టమర్లకు త్వరితగతిన రుణాలు అందించడానికి వీలు పడుతుందని బ్యాంక్ జనరల్ మేనేజర్ హర్షద్ కుమార్ సోలంకి తెలిపారు.