శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 31, 2020 , 01:25:38

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ, జనవరి 30: బ్యాంక్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండు రోజులపాటు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇదివరకే బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)తోపాటు ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సమాచారాన్ని చేరవేశాయి కూడా. దీంతో బ్యాం కింగ్‌ కార్యకలాపాలైన చెక్కు క్లియరెన్స్‌, నగదు ఉపసంహరణ, డిపాజిట్‌ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కానీ, ప్రైవేట్‌ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు మాత్రమ యథాతథంగా పనిచేయనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌ రోజే బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెకు దిగడం విశేషం. రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. ఈ యూఎఫ్‌బీయూ కింద తొమ్మిది కార్మిక సంఘాల్లో ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫడరేషన్‌(ఏఐబీవోసీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ వర్కర్స్‌(ఎన్‌వోబీడబ్ల్యూ) ఉన్నాయి. ఈ సందర్భంగా ఏఐబీఈఏ జనరల్‌ సెక్రటరీ సీహెచ్‌ వెంకటాచలం మాట్లాడుతూ.. రెండేండ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ ఉద్యోగుల వేతన సవరణపై పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయని, గురువారం కూడా ఐబీఏతో జరిపిన చర్చలు సఫలం కాలేదని, దీంతో చేసేదేమి లేకపోవడంతో సమ్మెకు దిగాల్సి  వచ్చిందన్నారు. ఉద్యోగ సంఘాలు వేతనాలను 20 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తుండగా..ఐపీఏ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు.


logo