న్యూఢిల్లీ: ఈ వారం మీకు బ్యాంకు పనులు ఏమైనా ఉన్నాయా..? ఆ బ్యాంకు పనులు కచ్చితంగా ఈ వారంలో పూర్తి చేయాల్సినవా..? వచ్చే వారానికి వాయిదాపడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా..? అయితే మీరు తప్పకుండా రేపే ఆ పనులను పూర్తిచేసుకోండి. ఎందుకంటే బుధవారం నుంచి ఆదివారం వరకు ఈ వారం బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. సోమవారం ఎలాగూ పూర్తయ్యింది. ఇక మిగిలింది మంగళవారం ఒక్కటే. కాబట్టి గుర్తుపెట్టుకుని మరీ మీరు రేపే మీ బ్యాంకు వ్యవహారాలను చక్కబెట్టుకోండి.
సెప్టెంబర్ 8న (బుధవారం) శ్రీమంత శంకరదేవ తిథి సందర్భంగా బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 9న (గురువారం) తీజ్ పండుగ కాబట్టి బ్యాంకులు తెరచుకోవు. ఇక సెప్టెంబర్ 10న (శుక్రవారం) వినాయక చవితిని పురస్కరించుకుని బ్యాంకులకు హాలిడే. సెప్టెంబర్ 11న (శనివారం) రెండో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు దినం. సెప్టెంబర్ 12న ఆదివారం కాబట్టి రెగ్యులర్ వీక్లీ హాలిడే. అంటే సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు వరుసగా బ్యాంకులకు సెలవులే ఉన్నాయి.
కాగా, ఈ బ్యాంకు హాలిడేస్ అన్ని రాష్ట్రాలకు ఒకేలా వర్తించవు. పైన పేర్కొన్న పండుగలు అన్నీ జరుపుకునే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో పై పండుగలు అన్నీ ముఖ్యమైనవి కావు. అలాంటి రాష్ట్రాల్లో ఏ పండుగ అయితే జరుపుకోరో ఆ రోజు ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేస్తాయి.